మనం చూసే సినిమా నిడివి రెండున్నర గంటలే కావచ్చు. కానీ దానికి దాదాపు ఆరేడునెలల పాటు వేల మంది కోట్లాది రూపాయల ఖర్చుతో ఎంతో శ్రమపడితే గానీ ఈ రెండున్నర గంటల చిత్రం థియేటర్లలో కనిపించదు. ఇక నేడు ప్రతి విషయంలోనూ పోటీ పెరిగినట్లే సినిమా ఫీల్డ్‌లో కూడా విపరీతమైన పోటీ పెరిగింది. నాటి కాలంలో గుర్రపుస్వారీ, కార్లు నడపడం వంటివి కూడా డూప్‌ల సాయంతో చేసేవారు. కానీ నేటి ప్రేక్షకులు సాంకేతికంగా ఎంతో ముందు ఉన్నారు. డూప్‌లతో చేసిన సీన్స్‌ని వెంటనే పసిగడుతున్నారు. దాంతో ఎంతో రిస్క్ ఉన్న సీన్స్‌ని కూడా మన నటీనటులే ఒరిజినల్‌గా చేసేందుకు ఒళ్లు హూనం చూసుకుంటూ ఉన్నారు. కేవలం థియేటర్లలో ఓ ఐదు నిమిషాలు ప్రేక్షకులను మెప్పించడం కోసం, వారిని రంజింపజేసి చప్పట్లు కొట్టించడం కోసం ప్రాణాలను సైతం రిస్క్‌లో పెడుతున్నారు.
ఈ క్రమంలో నాటి అమితాబ్ నుంచి చిరంజీవి, బాలకృష్ణ వరకు ఎన్నోసార్లు తీవ్రంగా గాయపడిన వారే. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య నిర్మాతగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం అజర్‌బైజాన్‌లో జరుగుతోంది. ఇక్కడ రామ్‌చరణ్, విలన్ వివేక్ ఒబేరాయ్‌ల మీద ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ స్పాట్ ఫొటోలను వివేక్ ఒబేరాయ్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఈ భారీ యాక్షన్ సీన్‌ని తేనెటీగలు ఉన్న ఫామ్‌హౌస్ దగ్గర చిత్రీకరిస్తున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా తేనెటీగలు రెచ్చిపోవడం ఖాయం. కానీ యూనిట్ మొత్తం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ అక్కడే ఈ రిస్క్‌ని చేస్తున్నారు. ఈ వీడియోని తాజాగా రామ్‌చరణ్ శ్రీమతి ఉపాసన ఓ వీడియోని పోస్ట్ చేసింది. నిజంగా దేశంగానీ దేశంలో తన భర్త ఇలాంటి రిస్కీ పనులు చేస్తుంటే దానిని ఆనందంగా అభిమానుల సంతోషం కోసం ఒప్పుకోవడం కూడా మాటలు చెప్పినంత సులువు కాదు అన్నది మాత్రం వాస్తవం.