కెరీర్ బిగినింగ్‌లో ద్వందార్ధాలతో కూడిన పెద్దలకు మాత్రమే తరహా చిత్రాలను తీశాడు దర్శకుడు మారుతి. అదే సమయంలో ఆయనపై మరో విమర్శ కూడా ఉండేది. నిర్మాతగా తన పేరు వేసుకుని దర్శకునిగా వేరే వారిని పెట్టుకుని సినిమాలు తీస్తాడని, అవి హిట్ అయితే తానే ఆ చిత్రానికి దర్శకుడిని అని చెప్పుకుంటాడని, అదే అలా తీసిన చిత్రం ఫ్లాప్ అయినా, విమర్శలు వచ్చినా అది నేను తీసిన చిత్రం కాదని చెబుతాడనే విమర్శ బాగా ఉండేది. ఇదే విషయంలో 'ప్రేమకథా చిత్రమ్' నుంచి పలు సినిమాల విషయంలో బయటపడింది. కొందరు హీరోలైతే ఆయన దర్శకత్వంలో చిత్రం చేస్తే తమకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అవుతారని కూడా నాడు భయపడేవారు. కానీ ఆయనపై ఉన్న ఈ చెడ్డ పేరును 'భలే భలే మగాడివోయ్' పోగొట్టింది. ఇక ప్రస్తుతం ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయేల్, మురళీశర్మ, నరేష్, వెన్నెల కిషోర్‌లు ప్రధాన పాత్రల్లో 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రం ఈనెల 13వ తేదీన విడుదల కానుంది.
ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ, ఇది సాధారణమైన అత్త-అల్లుడి సంఘర్షణ కాదు. ఈ కథతో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. కానీ 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం అలా ఉండదు. అత్తకు ఇగో ఉంటే కూతురికి కూడా ఇగో ఉంటుంది. వీరిద్దరి మధ్య నలిగిపోతూ, వారిద్దరికి నచ్చచెబుతూ హీరో హీరోయిన్‌ని ఎలా వివాహం చేసుకున్నాడనేదే కథ. గత చిత్రాలతో పోల్చుకుంటే ఇందులో నాగచైతన్య ఎంతో డిఫరెంట్‌గా కనిపిస్తాడు. చాలా హుందాగా నటించాడు. కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలలో ఆయనలో నాగార్జున కనిపించాడు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన అనేక కుటుంబకథా చిత్రాలు మంచి వినోదాన్ని అందించాయి. ఇది కూడా అలాగే ఉంటుంది. చైతన్య-రమ్యకృష్ణ పోటాపోటీగా నటించారు. క్లైమాక్స్ సన్నివేశాలలో మంచి భావోద్వేగం ఉంటుంది. చైతూ బాగా చేశాడు. టైటిల్ పాతదిగానే అనిపించవచ్చు. కానీ 'సమరసింహారెడ్డి'లోని పవర్ ఇందులో కూడా ఉంది. నాకు దర్శకునిగా అన్ని చిత్రాల కంటే ఇది ప్రత్యేకం. వెన్నెలకిషోర్ పాత్ర నవ్వులు పూయిస్తుంది.
'మహానుభావుడు' చిత్రాన్ని అఖిల్‌తో చేయాలని అనుకున్నాను. కానీ ఆయన అప్పుడు 'హలో' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. బాగా ఆలస్యమవుతుందని శర్వానంద్‌తో చేశాను. త్వరలో గీతాఆర్ట్స్, యువి క్రియేషన్స్ కలిసి ఓ చిత్రం తీయనున్నాయి. ఆ చిత్రానికి నేనే దర్శకత్వం వహిస్తున్నాను. మహేష్ సోదరి మంజుల నిర్మాతగా మరో చిత్రం చేయనున్నాను. ఓ సినిమా చేద్దామని విజయ్ దేవరకొండ నన్ను అడిగాడు. తనతో చేయాలని నాకూ ఉంది. కానీ ఆయనకు సరిపోయే కథ దొరకాలి. 1980 నేపథ్యంలో ఓ చిత్రం తీయాలని ఉంది. నేను నిర్మాతను కాను. నాలో దర్శకుడే ఉన్నాడు. నాకు డైరెక్షనే ఇష్టం అని ఇంతకాలానికి మారుతి ఓపెన్‌గా చెప్పాడు. ఇక అత్తా-అల్లుళ్ల సంఘర్షణతో 'గుండమ్మకథ' నుంచి 'అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు'తోపాటు ఈ తరహా చిత్రాలలో నాగ్ కూడా నటించాడు. మరి రమ్యకృష్ణ వంటి నటికి పోటీగా చైతు ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి..!