సాధారణంగా దర్శకులు, నిర్మాతలు, ఇతర తెర వెనుక ఉండే టెక్నీషియన్స్ తెరపై కనిపించాలని ఆశపడుతూ ఉంటారు. రామానాయుడు, కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు, కె.యస్. రవికుమార్, మణివన్నన్, కె.బాలచందర్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. కాశీవిశ్వనాథ్, ఉపేంద్ర, వందేమాతరం శ్రీనివాస్, జివి ప్రకాష్, విజయ్ ఆంటోని నుంచి దేవిశ్రీప్రసాద్ వరకు అదే దారిలో నడుస్తున్న వారే. ఇలా టెక్నీషియన్స్ తెర మీద కనిపించాలని ఆశపడుతుంటే తెరపై ఓ వెలుగు వెలిగే వారు నిర్మాతలు, దర్శకులుగా మారుతుంటారు. కొత్త ఒక వింత, పాత ఒక రోత అనేది దీనికి సరిగా సరిపోతుంది. అయితే ఇలా మారిన వారిలో సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ని లీడ్ చేసే వారు కొందరు మాత్రమే ఉంటారు. ఆ కోవలోకి కళాతపస్వి కె.విశ్వనాథ్ కూడా వస్తారు.
మొదట్లో ఆయనకు నటన మీద పెద్దగా ఆసక్తి లేదు. అందువల్లనే ఆయన తీసిన ఆపద్బాంధవుడు చిత్రంలో జంధ్యాల చేత తాను చేయాలని భావించిన పాత్రను చేయించారు. కానీ కె.విశ్వనాథ్‌కి దగ్గరి బంధువైన గాన గంధర్వుడు ఎస్పీబాలసుబ్రహ్మణ్యం కమల్‌హాసన్, ఆమని నటించిన 'శుభసంకల్పం' చిత్రంలోని రాయుడు పాత్రకి సంబంధించిన డైలాగ్స్‌ని, ఆ పాత్ర తీరు తెన్నులను కె.విశ్వనాథ్ బాలుని ముచ్చట గొలిపే విధంగా చెప్పడంతో బాలు బలవంతం మీద ఆ చిత్రంలోని రాయుడు పాత్రని పోషించాడు. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన 'కలిసుందాం..రా' చిత్రం నటునిగా కె.విశ్వనాథ్‌కి ఎంతో పేరు తెచ్చింది. మొదట ఈ చిత్రంలోని వెంకటేష్ తాత పాత్ర వీర వెంకట రాఘవయ్య పాత్రకి ఎందరిని అనుకున్నా నిర్మాత సురేష్‌బాబుకి నచ్చలేదు. చివరకు షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో సత్యనారాయణను ఆ పాత్రకు తీసుకున్నారు.
అంతలో ఒకరోజు కె.విశ్వనాథ్ తన బంధువులకు రామానాయుడు స్టూడియో చూపించేందుకు వచ్చారు. అప్పుడు కె.విశ్వనాథ్ కోరమీసాలు పెంచుకుని ఉన్నారు. అలా కోరమీసాలతో ఉన్న విశ్వనాథ్‌ని చూడగానే సురేష్‌బాబులో ఆనందం కనిపించింది. ఆయన కళ్లముందు వీరవెంకట రాఘవయ్యగా కె.విశ్వనాథ్ రూపమే కదలాడింది. దాంతో వెంటనే ఆ పాత్రకి ఆయన్నే తీసుకున్నారు. ఆ పాత్ర ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేయడం, వెంటనే కళాతపస్వి నటునిగా బిజీ అయిపోవడం జరిగాయి.