తెలుగు సినీ పరిశ్రమ కేవలం కొందరి వల్ల తన పరువును పోగొట్టుకుంటోంది. ఏదో రంగంలో అదృష్టవశాత్తు వచ్చిన డబ్బును సినిమా రంగంలో అయితే పేరుకి పేరు, ఎంజాయ్‌మెంట్‌కి ఎంజాయ్‌మెంట్ రెండు వస్తాయని ఇక్కడ పెట్టుబడులు పెట్టి సినిమాపై ఏమాత్రం అభిరుచి లేని వారు నిర్మాతలుగా వచ్చి క్యాస్టింగ్‌కౌచ్ నుంచి ఆర్టిస్టుల వద్ద డబ్బులు తీసుకుంటూ పరిశ్రమ పరువును తీస్తున్నారు. మరికొందరు తమ డబ్బును ఇతరుల చేత బినామీగా పెట్టి ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఇలా పార్ట్‌టైమ్ నిర్మాతల వల్ల నిజమైన నిర్మాతలకు కూడా చెడ్డపేరు వస్తోంది.
ఇక తెలుగు పరిశ్రమలో చెక్ బౌన్స్ కేసుల కైతే కొదువే ఉండదు. హీరోలు, దర్శకులు, హీరోయిన్ల మెప్పు కోసం కోట్లాది రూపాయలను గిఫ్ట్‌ల రూపంలో వెదజల్లే నిర్మాతలు కూడా ఐదు పది లక్షల వద్ద కక్కుర్తి పడి చెక్ బౌన్స్ కేసుల్లో ఇరుక్కుని చెడ్డ పేరు తెస్తున్నారు. వీరిలో ఒకరు బ్లాక్‌బస్టర్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్. తాజాగా నిర్మాత, నటుడు బండ్లగణేష్ ప్రొద్దుటూరు కోర్టుకి హాజరు అయ్యాడు. చెక్‌బౌన్స్ కేసుకి సంబంధించిన విచారణ నిమిత్తం ఆయన కోర్టుకి హాజరు కావాల్సివచ్చింది. కోర్టుకి వెళ్తున్న సమయంలో ఆయన ముఖానికి గుడ్డ కట్టుకున్నాడు. కేసు వివరాలలోకి వెళ్తే, ప్రొద్దుటూరుకి చెందిన ఏకంగా 68 మంది బండ్ల గణేష్‌కి వడ్డీకి డబ్బులు ఇచ్చారు. ఆ లావాదేవీలకు సంబంధించి బండ్ల గణేష్ ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయి.
దీంతో బాధితులు బండ్ల గణేష్‌పై కోర్టుకి వెళ్లారు. ఇందులో మూడు కేసులకు సంబంధించి కోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు లోక్ అదాలత్‌లో మూడు కేసులు రాజీ అయ్యాయని తెలుస్తోంది. కేసు విచారణ నిమిత్తం కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది. గతంలో నిర్మాతలు తమ నోటి మాటనే గొప్పగా భావించేవారు. నోటి మాట కోసం సర్వం త్యాగం చేయడానికి సిద్దపడే వారు. కానీ నేటి ఇలాంటి నిర్మాతలను చూస్తే ఛీ.. ఇదేం పెద్ద మనుషులు అనిపించకమానదు.