అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలను పక్కన పెట్టేసిన పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బాగా బిజీ అయ్యాడు. జనసేన అధ్యక్షుడిగా.. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా వుండి సినిమాలవైపు చూడడమే మానేసాడు. 2019 ఎన్నికలే టార్గెట్ గా పవన్ కళ్యాణ్ ఒక ఎజెండా తో సినిమాలను పక్కన పెట్టేసాడు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు చెయ్యాల్సి ఉంది. ఆ సినిమాలకు పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ లు కూడా తీసుకున్నాడు. కానీ రాజకీయాలంటూ.. సినిమాలను వదిలెయ్యడం.. అడ్వాన్స్ లును పవన్ కళ్యాణ్ నిర్మాతలకు వెనక్కి ఇచ్చేసాడనే టాక్ నడిచింది. మరి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి ముఖానికి మేకప్ వేసుకోబోతున్నాడంటున్నారు.
అది కూడా మేనల్లుడి కోసమే పవన్ మళ్ళీ సినిమాల్లో నటించేందుకు సన్నద్ధం అవుతున్నాడట. ప్రస్తుతం మెగా మేనల్లుడిగా సాయి ధరమ్ తేజ్ సినిమాల్లో హీరోగా పేరు తెచ్చుకున్నాడు. సినిమాలు హిట్ అవనివ్వండి ఫట్ అవనివ్వండి సాయి ధరమ్ హీరోగా నిలబడ్డాడు. ఇక ఇప్పుడు తాజాగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్‌తేజ్‌ని హీరోగా పరిచయం చేయడానికి రంగం సిద్ధమవుతోందనే టాక్ నడుస్తుంది. అయితే వైష్ణవ్ తేజ్ ని ఆ డైరెక్టర్ డైరెక్ట్ చేస్తాడు.. ఈ డైరెక్టర్ పరిచయం చేస్తాడనే టాక్ నడిచినా... ఇపుడు మాత్రం పవన్‌కల్యాణ్ తో గోపాల గోపాల, కాటమరాయుడు చిత్రాలను తెరకెక్కించిన కిశోర్ పార్ధసాని (డాలి).. వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చెయ్యడానికి ఓ కథ సిద్ధం చేసాడట.
అయితే దర్శకుడు డాలి సిద్ధం చేసిన కథలో ఒక పవర్ ఫుల్ పాత్ర ఉందని.. ఆ కేరెక్టర్ ని పవన్‌తో చేయించాలని డాలి ప్రయత్నిస్తున్నట్లు.... పవన్ కూడా మేనల్లుడి కోసం ఆ పాత్ర చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మించనున్నాడు. ఇక దర్శకుడు.. పవన్ కి సన్నిహితుడు కావడం, నిర్మాత ఫ్రెండ్ కావడంతో.. అందరూ కలిసి పవన్ కళ్యాణ్ ని మేనల్లుడి కోసం ఆ పాత్ర చేయించేందుకు ఒప్పించినట్లుగా తెలుస్తుంది.