మనిషికి ఒకే గోల్ ఉంటే దాని మీదనే దృష్టి పెడతాడు. అదే ఒక వ్యక్తిలో ఎన్నో నైపుణ్యాలు ఉంటే మాత్రం ఒకదాని మీద కూడా నిలకడ చూపించలేకపోవడం అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇక అందం, అభినయం, అద్భుతమైన టాలెంట్ ఉండే వారిలో కాస్త చపలత్వం, నిలకడలేమి, పొగరు కూడా ఉంటాయి. దీనికి ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చు. ఉదాహరణకు నేటి శృతిహాసనే దానికి ఓ మంచి ఉదాహరణ. ఇదే పోకడ కలిగిన నటి నిత్యామీనన్. ఈమెలో అద్భుతమైన నటి ఉంది. అందం, అభినయం కలపోసిన నటి. ఒకానొక వేడుకలో బాలకృష్ణ వంటి స్టార్ నిత్యామీనన్ కాస్త పొడవు ఉండి ఉంటే సౌందర్య స్థానంలో ఆమెని దౌపత్రిగా తీసుకుని 'నర్తనశాల'ను మరలా తీసేవాడినని కాంప్లిమెంట్ ఇచ్చాడు.
ఇక నిత్యామీనన్ ఏదైనా చిత్రంలో ఓ పాత్ర చేస్తోందంటే ఆ పాత్రలోనే కాదు.. సినిమా కూడా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుందని అందరూ భావిస్తారు. బాలనటిగా మొదలై పలు మలయాళ చిత్రాలలో నటించిన తర్వాత తెలుగులోకి 'అలా.. మొదలైంది' ద్వారా ఈమె పరిచయం అయింది. ఆ వెంటనే 'ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే' వంటి పలు హిట్ చిత్రాలలో నటించింది. మరి శ్రద్ద లేకనో మరో కారణం వల్లనో కానీ ఆమె తన ఫిజక్‌పై పెద్దగా శ్రద్ద చూపే తత్వంకాదు. కేవలం నటన మాత్రమే ఉంటే సినిమా ఫీల్డ్‌లో సరిపోదని, గ్లామరస్ ఫిజిక్ కూడా ఉండాలనే విషయాన్ని ఈమె పెద్దగా పట్టించుకోదు. దాంతోనే ఆమెకి ఈమధ్య కాలంలో 'మెర్సల్, 24' వంటి స్టార్స్ చిత్రాలలో అవకాశాలు వచ్చినా అవి కేవలం సెకండ్ హీరోయిన్ తరహా పాత్రలే కావడం గమనార్హం.
ఇక తాజాగా ఈమె మాట్లాడుతూ తాను ఈ ఏడాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'మహానటి'లో టైటిల్ పాత్రను చేయాల్సివుంది. ఆ పాత్రకు తొలుత ఓకే చెప్పాను. నన్ను సావిత్రిలా ఉన్నావని పలువురు పోల్చారు. అప్పుడు ఎంతో సంతోషం వేసింది. 'మహానటి'లో నటించమని అడిగితే అంతటి అద్భుతమైన పాత్రను వదులుకోలేక చేస్తానని చెప్పి అంగీకరించాను. ఆపై కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం వదులుకున్నాను... అని చెప్పుకొచ్చింది. అయితే 'మహానటి'ని ఎందుకు వదులుకుందో మాత్రం ఆమె తెలపలేదు. మరి ఆ అదృష్టం బహుశా కీర్తిసురేష్‌కి రాసి ఉండటమే ఈమె నో చెప్పడానికి పరోక్ష కారణం అయి ఉంటుంది.
ఈమె ఇంకా మాట్లాడుతూ, నేను ఇప్పటి వరకు ఎవ్వరినీ ప్రేమించలేదు. ఎవరి భావాలను మనం అనుభవిస్తున్నట్లు అనిపిస్తే, వాళ్లపై ప్రేమ ఉన్నట్లే. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్చమ్ చేసేందుకు పలువురు కళాకారులను ఒక చోటికి చేరుస్తున్నాను. ఇది పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది అని చెప్పుకొచ్చింది. నటిగా అద్భుతమైన అవకాశాన్ని కాదనుకుని ప్రస్తుతం ఈమె మ్యూజిక్ ఆల్బమ్ మీద దృష్టి పెట్టడం చూస్తే ఈమె మనస్తత్వం అర్ధం అవుతుంది. అన్నట్లు ఈమె మంచి ప్లేబ్యాక్ సింగర్ కూడా అన్న విషయం తెలిసిందే.