దాసరి బతికున్నంతకాలం కార్మికసంఘాల విషయంలో, ఇతర విషయాలలో సినీ పెద్దలుగా చెలామణి కావడానికి దాసిరితో పాటు తమ్మారెడ్డి భరద్వాజ ఎంతగానో పోరాడాడు. దాసరి వంటి వ్యక్తి బతికున్నప్పుడు పెద్దమనిషి పదవి కోసం పోరాడిన తమ్మారెడ్డి ఇప్పుడు దాసరి బతికిలేనప్పుడు మాత్రం ఇదంతా తనకెందుకులే అన్నట్లు ప్రవర్తిస్తూ ఉండటం సరికాదు. పెద్దరికం అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు. ఇండస్ట్రీలోని సమస్యలను గుర్తించి వారు వీధులలో పడకుండా సమస్యను పరిష్కారం చేసినప్పుడు పెద్దరికం అనేది దానంతట అదే వస్తుంది. ఇక నేడు పరిశ్రమ వారి తీరు ఎలా ఉంది అంటే వారే డ్రగ్స్ విషయంలో ఇరుక్కుంటారు. వారిలోని శ్రీరెడ్డి, మాధవీలత, కత్తిమహేష్ వంటి వారే ఇండస్ట్రీని బజారుకీడుస్తారు. కానీ ఆ విషయాన్ని మీడియా రిపోర్ట్ చేసి, ఎవరి అభిప్రాయాలు ఏమిటి? ఎవరిది తప్పు? అనే విషయంలో విశ్లేషణలు చేస్తే మాత్రం తప్పంతా మీడియాదే అంటారు. అత్త తిట్టినందుకు కాదు... తోడికోడలు నవ్వినందుకు అన్న చందంగా వీరి ప్రవర్తన ఉంటోంది.
ఇక మా అసోసియేషన్ సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం విషయంలో మా అధ్యక్షుడు శివాజీరాజా పది పైసలు దుర్వినియోగం కూడా జరగలేదని అది నిజమని నిరూపిస్తే తన ఆస్తినంతా రాసిస్తానని చాలెంజ్ విసిరాడు. మా ప్రధాన కార్యదర్శి నరేష్ మాత్రం నిజ నిర్ధారణ కమిటీ కావాలంటున్నాడు. దీనిపై తమ్మారెడ్డి స్పందించాడు. కానీ ఆయన వ్యవహారశైలి, మాటలు కూడా పాము చావకూడదు.. కర్ర విరగకూడదు అనే విధంగా ఉంది. ఆయన మాట్లాడుతూ, శివాజీరాజా, నరేష్‌లు ఇద్దరు ఎంతో మంచి పిల్లలు. వారు చిన్నప్పటి నుంచి నాకు తెలసు. ఇద్దరు ఇండస్ట్రీకి కావాల్సిన వారు. ఓ ఫంక్షన్‌కి, ఓ కంపెనీ వారు కోటి రూపయలు ఇచ్చారు. ఆ వేడుకకు చిరంజీవి గారిని రమ్మంటే అమెరికా వెళ్లారు. అందరు కలిసి అమెరికా వెళ్లోచ్చారు. వాళ్లు ఇచ్చిన కోటి కంటే ఎక్కువ వస్తుందా? లేదా? అనేది ముందుగా సంతకాలు పెట్టేముందు ఆలోచించుకోవాలి. సంతకాలు పెట్టిన తర్వాత కోటి కంటే ఎక్కువ వచ్చేది అని బజారుకెక్కడం హాస్యాస్పదంగా ఉంది.
ఇద్దరు ఆలోచించుకోకుండా బజారున పడ్డారు. ఇద్దరు ప్రెస్‌మీట్స్ పెట్టి ఒకరిపై ఒకరు దుమ్తెత్తి పోసుకున్నారు. నవ్వాలో, ఏడవాలో, కొట్టాలో, కోప్పడాలో, తిట్టాలో అర్ధం కాని పరిస్థితి. మాలాంటి మూలన ఉన్న వారో ఇతరులో టివిలలో మాట్లాడేందుకు తప్ప ఇది దేనికీ పనికిరాదు. ఇటువంటి సమస్యలన్నింటికి ఇండస్ట్రీలో ఓ కమిటీ వేసుకున్నాం. వాస్తవానికి ఆ కమిటీలో కూర్చుని మాట్లాడుకుని ఉంటే సమస్య పరిష్కారం అయిపోయి ఉండేది. ఇష్యూ లేని దానిని పెద్దది చేసి మనల్ని మనం చులకన చేసుకుని ఇతరులకు విమర్శించే అవకాశం ఇవ్వడం తప్ప దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. మీ ఇద్దరు కూర్చుని కమిటీలో కలిసి మాట్లాడుకోండి. సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పుకొచ్చాడు. అంటే నిధులు ఏమైనా గానీ మన మద్యనే అన్నిదాచి ఉంచుకోవాలి అన్నట్లుగా తమ్మారెడ్డి సలహా ఇవ్వడం మాత్రం సరికాదని చెప్పాలి.