సినీ నటీనటుల జీవితాలు చూడటానికి ఎంతో అందంగా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తరహాలో ఉంటూ ఉంటాయి. కానీ వారి వెండితెర జిలుగుల మద్య ఎన్నో తెలియని ఆవేదనలు, బాధలు ఉంటాయి. ఎవరు ఎందుకు ప్రేమిస్తారు? తనని చూసి నిజంగా ప్రేమిస్తున్నారా? లేక తమ క్రేజ్‌ని, ఇమేజ్‌ని, తమ డబ్బుని చూసి ఇతరులు ప్రేమిస్తున్నారా? అనేది కూడా అర్ధం కాని పరిస్థితి. ఇలా ఎందరి జీవితాలో హత్య, ఆత్మహత్యలకు బలవుతూ ఉంటాయి. తాజాగా బెంగాళీ పరిశ్రమలో ఓ విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బెంగాళీ సినీ, టివి నటి పాయల్ చక్రవరి (38) మృతి చెందింది.
పశ్చిమబెంగాల్‌లోని సిరిగురిలోని ఓ హోటల్ గదిలో ఆమె ఫ్యాన్‌ని వేలాడుతూ కనిపించింది. హోటల్‌లో దిగిన ఆమె మరుసటి రోజు గ్యాంగ్‌టక్ వెళ్లాలని హోటల్ నిర్వాహకులకు చెప్పారు. గదిలో దిగేముందే తనని ఎవ్వరూ డిస్ట్రిబ్ చేయవద్దని చెప్పారని, ఆ రోజు రాత్రి ఆమె భోజనం కూడా చేయలేదని హోటల్ సిబ్బంది చెప్పారు. తర్వాత రోజు ఆమె గది తలుపును ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో.. లోపలికి వెళ్లి చూస్తే ఆమె ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించిందని వారు తెలిపారు. పాయల్ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పూర్తి దర్యాప్తు తర్వాతే ఆమెది హత్య, ఆత్మహత్య అనేది తేలుతుందని పోలీస్‌లు చెబుతున్నారు.
సినిమాలు, సీరియళ్లు, పలు వెబ్‌సిరీస్‌లో పాయల్ నటించింది. చోఖేరా తారా తుయ్, గోయెండా గిన్ని, వంటి షోలలో ఆమె చేస్తున్నారు. పాయల్ మృతితో బెంగాళీ పరిశ్రమ వారు దిగ్బాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆమె తన భర్త నుంచి కొంతకాలంగా వేరుగా ఉంటున్నారు. పాయల్‌కి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె మరణవార్త తెలుసుకున్న కుటుంబసభ్యులు సిరిగురి చేరుకున్నారు. పాయల్ రాంచి వెళ్తున్నట్లు తమతో చెప్పిందని, ఇక్కడికి ఎందుకు వచ్చిందో తమకు అర్ధం కావడం లేదని ఆమె తండ్రి ప్రబీర్‌గుహా తెలిపారు.