అసెంబ్లీ రద్దు తర్వాత కేసీఆర్ మరింతగా రెచ్చిపోతున్నాడు. సరైన ప్రతిపక్షం లేకపోవడం, ప్రతిపక్షాలు బలపడే సమయం ఇవ్వకుండా ప్రభుత్వ వ్యతిరేకత మరింతగా పెరగకముందే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకోవడం ఆయన సమయస్ఫూర్తిని చాటుతోంది. మరోవైపు కేటీఆర్, హరీష్‌రావుల పోరు ముదరకముందే ఇద్దరు ఎంపిక చేసిన అభ్యర్ధుల జాబితా వల్ల రాబోయే విపత్తులను గమనించి కేసీఆర్ అభ్యర్ధులను కూడా ప్రకటించి తన దారిలో దూసుకెళుతున్నాడు. ఇక అసెంబ్లీ రద్దు తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను చెప్పాల్సిందంతా చెప్పి, ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీల విమర్శలతో పాటు మీడియా వర్గాల ప్రశ్నలకు కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు వేయండి అని మీడియా ప్రతినిధులకు సూచించిన ఆయన కేవలం తనకు అనువైన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చాడు. మీడియా వారు వేసిన ప్రతి ప్రశ్నకు ‘ఇదొక ప్రశ్నా? దానికి మీరు నా సమాధానం అడుగుతారా’? అంటూ కౌంటర్స్ ఇచ్చాడు. అంతేకాదు మీకు ఈమాత్రం తెలియదా అంటూ మీడియాపై సెటైర్లు వేశాడు.
మోదీపై అడిగిన ప్రశ్నకు మాత్రం మోదీకి కోపం రాకుండా సమయస్ఫూర్తి చూపించాడు. మోదీపై వ్యతిరేకత ఉందో లేదో ఎన్నికలకు వెళ్లే వరకు తెలియదు కదా...! అయినా మోదీకి అనుకూలంగా కూడా ఉండవచ్చు కదా...! అది మేమెలా చెబుతాం అని సమాధానం ఇచ్చాడు. తెలంగాణలో బిజెపి పరిస్థితి మీరు నన్ను అడగటం ఏమిటి? అది అందరికీ తెలిసిందే. రేపొద్దున కల్లా నాకు పీఎం అయి పోవాలని ఉంటుంది. అయిపోతానా? తెలంగాణలో బిజెపి పరిస్థితి కూడా అంతే.. అంటూ తెలివిగా నీ యమ్మ అని కాకుండా నీ అమ్మ అంటూ తనదైన వాక్చాతుర్యంతో సమాధానం చెప్పి తాను మాటల మరాఠీనని నిరూపించుకున్నాడు. మొత్తానికి తెలంగాణలో ఎంఐఎంతో, కేంద్రంలో బిజెపి వంటి బద్ద విరుదులతో సఖ్యతగానే ఉంటూ కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి ఆయనకు విజయం తెచ్చేనా? లేదా? అన్నది వేచిచూడాల్సివుంది...!