నందమూరి కళ్యాణ్‌రామ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో ఏళ్లు అయినా ఆయన ఖాతాలో ‘అతనొక్కడే, హరేరామ్, పటాస్’ వంటి మూడు హిట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే ‘అతనొక్కడే’ ద్వారా నిర్మాతగా, హీరోగా తానే ఉండి దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చిన సురేందర్‌రెడ్డి ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా..నరసింహారెడ్డి’కి డైరెక్టర్‌గా చాన్స్ కొట్టేశాడు. ఇక రవితేజతో ‘కిక్’, ఎన్టీఆర్‌తో ‘ఊసరవెల్లి’, మహేష్‌బాబుతో ‘అతిథి’, రామ్‌చరణ్ ‘ధృవ’, అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ వంటి స్టార్స్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన నేడు టాప్ దర్శకునిగా కొనసాగుతూ ఉన్నాడు.
ఇక ‘పటాస్’ ద్వారా కళ్యాణ్‌రామ్ పరిచయం చేసిన అనిల్‌రావిపూడి ‘సుప్రీమ్, రాజా ది గ్రేట్’ చిత్రాల ద్వారా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి ప్రస్తుతం దిల్‌రాజు నిర్మాతగా, వెంకటేష్, మెగాహీరో వరుణ్‌తేజ్‌లతో ‘ఎఫ్2’ (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక విషయానికి వస్తే సినిమా రంగంలో ఒక హీరో కోసం తయారు చేసుకున్న స్టోరీలు పలు కారణాల వల్ల ఇతర హీరోలకు వెళ్తూ ఉంటాయి. అలాంటి చిత్రాలు హిట్ అయితే ఆ చిత్రం వదులుకున్న హీరో అయ్యో అనుకుంటాడు. ‘పటాస్’ చిత్రం విషయానికి వస్తే పక్కా ఎంటర్‌టైనర్‌గా నిలిచిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.
ఈ చిత్రం కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ హిట్‌గా నిలిచింది. కానీ వాస్తవానికి ఈ చిత్రం మొదట దగ్గుబాటి రానా వద్దకు వెళ్లిందట. తాజాగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ, అనిల్‌రావిపూడి మొదట ‘పటాస్’ కథను నాకే వినిపించాడు. ఇద్దరం కలిసి కొన్ని మార్పులు చేర్పులు చేశాం. అదే సమయంలో బాహుబలి షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. దాంతో ‘బాహుబలి’కే మరికొన్నిరోజులు కేటాయించాల్సివచ్చింది. అందువల్ల ‘పటాస్’ చిత్రం చేయలేకపోయాను అని రానా చెప్పుకొచ్చాడు.