మా అసోసియేషన్ సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో నిధుల గోల్‌మాల్ జరిగిన మాట వాస్తమేనని మా జనరల్ సెక్రటరీ సీనియర్ నరేష్ ఆరోపించారు. మా అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందువల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని, తనపై వచ్చిన ఆరోపణలకు శివాజీరాజా సమాధానం చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశాడు. మా అధ్యక్షునిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నరేష్ తాను అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నానని సంచలన ప్రకటన చేశాడు. మా అధ్యక్షుడు శివాజీరాజా జనరల్ సెక్రటరీ అయిన తనకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని, ఏప్రిల్ నుంచి శివాజీరాజా తన ఫోన్‌నెంబర్‌ని కట్ చేశాడని తెలుపుతూ దానికి సంబంధించిన కాల్‌డేటా, మెసేజ్ డేటాలను బయటపెట్టారు. నిజాలు నిర్భయంగా మాట్లాడుతాను కాబట్టే తనను దూరం పెడుతున్నారని మా అధ్యక్షునిపై వస్తున్న ఆరోపణలపై ఓ రిటైర్డ్ ఐపీఎస్‌తో నిజనిర్ధారణ కమిటీ వేయాలని తాను కోరానని, కానీ దానికి శివాజీరాజా అంగీకరించలేదని, ఈ విషయాన్ని తాను చిరంజీవికి కూడా తెలిపానని ఆయన వ్యాఖ్యానించారు.
ఎవరో ఒకరి తప్పుడు నిర్ణయాల వల్ల మా మొత్తం నిందలు మోయాల్సివస్తోందని, ఆవేదన వ్యక్తం చేశాడు. శివాజీరాజా పై ఉన్న నమ్మకంతోనే తాను పలు అగ్రిమెంట్స్‌పై సంతకాలు చేశానని, కానీ శివాజీరాజా నిర్ణయాలు తనకు ఆశ్చర్యం కలిగించాయని ఆయన వివరించారు. శ్రీరెడ్డి విషయంలో మా తీసుకున్న నిర్ణయం తనకు నచ్చలేదని, ఇటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల మాకు చేటు జరుగుతోందని అన్నారు. మా జనరల్ సెక్రటరీగా తనకు తగిన విలువ ఇవ్వకపోయినా తాను మహేష్‌బాబు ఈవెంట్‌కి అడ్డుపడబోనని, కళాకారుల సంక్షేమమే తనకు ముఖ్యమని తెలిపారు. చిరంజీవి ఈవెంట్ కి రెండు కోట్లు ఇస్తానని చెప్పినా కేవలం కోటిరూపాయలకే ఒప్పుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించింది. సాధారణంగా చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్‌ల ఈవెంట్స్ లోకల్‌గా జరిగినా కూడా రూ.5కోట్లు వస్తాయని, మరి ఈ ఈవెంట్లను కేవలం కోటి కోసం అమెరికాలో ఎందుకు పెట్టారని ఆయన నిలదీశారు.
ఇక ఈ వివాదం చూస్తే దాసరి వంటి సినీ పెద్ద లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దాసరి మరణం తర్వాతనే టాలీవుడ్ డ్రగ్స్ స్కామ్ నుంచి కత్తిమహేష్, శ్రీరెడ్డి వంటివారి గొడవలు మా పరువును అంతర్జాతీయ స్థాయిలో గంగలో కలుపుతున్నాయని, శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శనతోనే మా వైఫల్యం స్పష్టంగా కనిపించిందనే మాట కూడా వాస్తవమే. అసలు శివాజీరాజా సన్నిహితులు మాత్రం ఈ వివాదంలో పెద్ద తలకాయలు శివాజీరాజాను బలిపశువును చేస్తున్నాయని, నరేష్ స్వయాన ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి అల్లుడు కావడం వల్ల దీనికి రాజకీయ రంగు కూడా అంటుతోందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్లు ఇంత కాలం శివాజీరాజా చెప్పిన చోటల్లా సంతకాలు పెట్టి ఇప్పుడు మీడియా ముందుకువచ్చి ఎప్పుడో ముగిసిపోయిన మా సిల్వర్‌జూబ్లీ వేడుకల వ్యవహరాలను, శ్రీరెడ్డి విషయాన్ని నరేష్ మరలా కావాలనే తవ్వితీస్తున్నాడని, చట్టం ప్రకారం నమ్మకం మీద సంతకాలు పెట్టానని చెప్పడం, చట్టం తెలియకపోవడం వంటివి చెల్లవని, ఇందులో నరేష్ అంగీకారం, ఆయన సంతకాలు చేసిన అగ్రిమెంట్స్ కూడా ఉన్నందు వల్ల నరేష్ తన తప్పు నుంచి కూడా తప్పించుకోజాలడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.