రాజకీయాలు కలుషితమై పోయాయి. మనం క్యూలో రోజంతా పనులు మానుకుని ఓట్లేసి గెలిపించిన వారే ఆ తర్వాత మన మీద పెత్తనం సాగిస్తూ, మనల్ని నిలువునా మోసం చేస్తున్నారు. నిజానికి దేశంలో ఓట్లు వేసే వారి శాతం అటు ఇటుగా 50శాతం మాత్రమే ఉంది. అంటే మిగిలిన 50శాతం మంది అందరు అభ్యర్ధులకు నో చెబుతున్నట్లే లెక్క. కానీ ఒక్క ఓటు ఎక్కువ పడినా కూడా గెలిచే ఎన్నికల వ్యవస్థ మనది. అందుకే కొన్ని మావోయిస్ట్ సంఘాలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిస్తున్నాయి. అయితే ఈ విషయంలో అందరు కలిసి కట్టుగా ఉండాలి. ఫలానా పని చేస్తేనే మీకు ఓటు వేస్తాం. లేదంటే ఎవ్వరికీ ఓటు వేయమని ప్రజలందరు ఒక తాటిపైకి వస్తేనే మార్పు సాధ్యం. నేటిరోజుల్లో రాజకీయ నాయకులందరు దొంగలే. కాకపోతే గజదొంగ కంటే కాస్త చిన్న దొంగ మేలు అనే భావనే మేధావులందరిలో ఉంది. అందుకే ఓట్లు వేయని వారిలో చదువుకున్న మేధావులే అధికం. ఎక్కువగా ఓట్లు వేసేది గ్రామాల ప్రజలు, నిరక్షరాస్యులు మాత్రమే. అసలు ఓ వ్యక్తి ఓటు వేయకుంటే అతనికి ఎవ్వరి మీద నమ్మకం లేదనే భావించాలి. కానీ అలా తెలియజేయడానికి కూడా రోజంతా క్యూలో నిల్చొని 'నోటా' బటన్ నొక్కాల్సిందే అని మన పాలకులు అంటున్నారు.
ఇక విషయానికి వస్తే రాజకీయాలను అసహ్యించుకునే ఓ యువకుడి కథతో 'నోటా' చిత్రం రూపొందుతోంది. నాకు రాజకీయాలంటే చికాకు. ఒకవేళ నేనే రాజకీయం చేయదలుచుకుంటే ఇలా చేస్తాను.. అంటున్నాడు సెన్సేషనల్ స్టార్ విజయ్‌దేవరకొండ. 'పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి, మహానటి, గీతగోవిందం'వంటి చిత్రాలతో సంచలన రీతిలో దూసుకుపోతున్న విజయ్‌దేవరకొండ నటిస్తున్న చిత్రమే 'నోటా'. మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, తమిళ, తెలుగు భాషల్లో స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నాడు.
రాజకీయాలపై పోరాటం చేసే రాజకీయాలంటే పడని ఓ యువకుడి కథతో ఈ చిత్రం రూపొందనుంది. సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ట్రైలర్‌ని 6వ తేదీన విడుదల చేయనున్నారు. నాజర్, సత్యరాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. విజయ్‌దేవరకొండ స్టైల్‌కి, బాడీలాంగ్వేజ్‌కి, యాటిట్యూడ్‌కి ఈ కథ పాత్ర అద్భుతంగా సరిపోతాయనే నమ్మకం కలుగుతోంది. మరి ఈ చిత్రం 'ట్యాక్సీవాలా' కంటే ముందు విడుదల అవుతుందా? తర్వాత విడుదల అవుతుందా? అనేది వేచిచూడాల్సివుంది.