మెగా ఫ్యామిలీకి, నందమూరి ఫ్యామిలీకి సినిమాల పరంగా, రిలీజ్‌ల పరంగా, అభిమానుల పరంగా స్పర్దలు వుండవచ్చు గానీ బాలకృష్ణకి సినీ ఫీల్డ్‌లో ఉన్న అత్యంత ఇష్టమైన స్నేహితుడు చిరంజీవినే అన్న సంగతి తెలసిందే. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న 'ఎన్టీఆర్' చిత్రం రూపొందుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బసవతారకం పాత్రను విద్యాబాలన్, చంద్రబాబునాయుడు పాత్రను దగ్గుబాటి రానా, హరికృష్ణ పాత్రను నందమూరి కళ్యాణ్‌రామ్ చేస్తున్నారు. ఇక శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్‌సింగ్, జయప్రదగా రాశిఖన్నా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే తనను జయప్రద పాత్ర కోసం ఎవ్వరూ సంప్రదించలేదని తాజాగా రాశిఖన్నా తెలిపింది.
ఇక ఈ చిత్రంలో ఎస్వీరంగారావు పాత్రకి కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. మొదట నందమూరి కుటుంబంతో మోహన్‌బాబుకి వున్న సత్సంబంధాలు, 'మహానటి'లో కూడా మోహన్‌బాబు ఎస్వీఆర్‌గా మెప్పించడంతో ఎన్టీఆర్ బయోపిక్‌లో కూడా ఎస్వీఆర్ పాత్రను మోహన్‌బాబు చేస్తాడనే అందరూ భావించారు. కానీ 'మహానటి'లో నటించిన వారే ఎన్టీఆర్ బయోపిక్‌లో కూడా నటిస్తే ప్రేక్షకులు మొనాటనీగా ఫీలయ్యే అవకాశం ఉందని భావించిన బాలకృష్ణ, క్రిష్‌లు ఎస్వీరంగారావు పాత్రకి మెగాబ్రదర్ నాగబాబుని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల నాగబాబు గొంతు సమస్యతో బాధపడుతూ ఉండటంతో ఇందులో ఎస్వీరంగారావు పాత్రకి తగ్గట్లుగా నాగబాబుని తీసుకుని ఓ మంచి వాయిస్‌తో డబ్బింగ్ చెప్పించాలని భావిస్తున్నారట.
ఇక ఈ చిత్రంలోని పలు కీలక సన్నివేశాలను నాటి ఎన్టీఆర్ ఇష్టమైన నివాసం అయిన అబిడ్స్‌లో చిత్రీకరించాడు. ఇక నాటి సమైక్యాంధ్రరాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రవేశించిన హైదరాబాద్ అసెంబ్లీ.. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం.