యంగ్‌టైగర్ ఎన్టీఆర్‌కి ఆయన తండ్రి హరికృష్ణ అంటే ఎంతటి ప్రేమో ఎన్నోసార్లు నిరూపితం అయింది. తన తండ్రికి చీమంత ఇబ్బంది కలిగినా తాను తట్టుకోలేనని పలుసార్లు ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. తన సోదరుడు జానకీరాం కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తమ చిత్రాల సమయంలో కూడా ముందుగా రోడ్డు ప్రమాదాల గురించి హెచ్చరికలను, జాగ్రత్తలను సూచిస్తూ ఉంటాడు. తన వేడుకలకు హాజరయ్యే అభిమానులు కూడా రోడ్డు ప్రమాదాలకు గురవ్వకుండా జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తూ ఉంటాడు. అలాంటి ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా రోడ్డు దుర్ఘటనలో మరణించడంతో ఇక ఎన్టీఆర్ ఈ షాక్ నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పడుతుందని పలువురు భావించారు. దాంతో ఎన్టీఆర్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో దసరాకి విడుదల ప్లాన్ చేసిన ‘అరవింద సమేత వీరరాఘవ’ షూటింగ్ ఆలస్యం అవుతుందని అనుకున్నారు.
కానీ తన వల్ల సినిమా ఆలస్యం కాకూడదని, తన వల్ల నిర్మాత ఇబ్బంది పడకూడదని ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇది చెప్పడానికి సులభమే కానీ బాధలో కూడా షూటింగ్‌లో నవరసాలను పడించడం అంత సులువు కాదు. కానీ ఎన్టీఆర్ దానిని నిజం చేయడం ఆశ్చర్యకరం. దాంతో ఆయన నిబద్దతకు పలు వైపుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రం షూటింగ్ బ్రేక్ లేకుండా చకచకా సాగిపోతోంది. ఎన్టీఆర్, తదితరులపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఈ నేపధ్యంలో ‘ఎన్టీఆర్ అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం. ఆయన డెడికేషన్ చూశాక ఆయనపై మరింత గౌరవం పెరిగింది.. అంటూ సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేశాడు. మేమంతా మీతో ఉన్నాం. మీకు మరింత మానసిక బలం చేకూరాలని’ ఆయన లోకేషన్లలోని ఎన్టీఆర్ ఫోటోలను పోస్ట్ చేశాడు. హ్యాట్సాఫ్ టు ఎన్టీఆర్.