అందరు శాఖాహారులైతే చికెన్‌ముక్కలు ఏమయ్యాయనే నానుడి మా అసోసియేషన్‌కి సరిగ్గా సరిపోతుంది. గతంలో మోహన్‌బాబు మా అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా ఇకపై మాలో సభ్యత్వం లేని వారిని, హీరోయిన్లను అనుమతించేది లేదని ఘనంగా ప్రకటించాడు. కానీ నేటి హీరోయిన్లలలో ఎందరికి మాలో సభ్యత్వం ఉందో గత మోహన్‌బాబు పీరియడ్ నుంచి నేటి వరకు చూసుకుంటే ఈ మాటల డొల్లతనం అర్ధమవుతోంది. ఇక తాజాగా మా సిల్వర్ జూబ్లీవేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని మా అసోషియేషన్ వారే ఇంటిగుట్టుని బయట పెడుతున్నారు. ఇది మంచికే జరిగిందని చెప్పాలి. ఎప్పటికైనా నిజాలు నిగ్గుతేల్చాల్సిందేనని ఒప్పుకోవాలి. ఈ విషయంలో మా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీనియర్ నరేష్.. విశ్రాంత న్యాయమూర్తులు, ఇతర ఉన్నతాధికారులో నిజనిర్ధారణ కమిటీనివేయమని కోరుతున్నాడు. మరి ఏ తప్పులేకపోతే కమిటీని వేయడంలో భయం ఎందుకు అనేది ఆలోచించాల్సిన విషయం.
ఇందులో ప్రధానంగా అమెరికాలో ఈ వేడుకల బాధ్యతలను స్వీకరించి మూడు కోట్లు ఇస్తామని చెప్పి, చివరకు కోటి రూపాయలు మాత్రమే ఇచ్చిన శ్రీకాంత్ స్నేహితుడి సంస్థపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. త్వరలో మహేష్‌బాబుతో కూడా అమెరికాలో ప్రోగ్రాం ఏర్పాటు చేయనున్నామని, కానీ సీనియర్ నరేష్‌ని పక్కన పెట్టడంతో నరేష్ ఉంటేనే దీనికి వస్తామని మహేష్‌బాబు శ్రీమతి నమ్రతా స్పష్టం చేసిందని నరేష్ చెప్పుకొచ్చాడు. కానీ ఈ వ్యవహారాలన్నింటిని శివాజీరాజా తనకు చెప్పకుండా బెనర్జీని తెరపైకి తెచ్చాడని నరేష్ అంటున్నాడు. ఆయన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ, అమెరికాలో వేడుకలకు బిజినెస్ క్లాస్ టిక్కెట్స్ ఇచ్చారని, ఒక్కో టిక్కెట్‌కి మూడులక్షలు ఖర్చయిందని, అసలు ఎవరికి ఏ క్లాస్ టిక్కెట్స్ కేటాయించాలి? అనే విషయం జనరల్ సెక్రటరీ నిర్ణయించాలి. మొదట్లో ఇంటిగుట్టు బయటకు రాకూడనే మీడియా ముందుకు రాకూడదని భావించామని, వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్షుడిని అయ్యేందుకే తాను ఇలాంటి ఆరోపణలు చేస్తున్నానని ఆరోపిస్తున్నారని, ఈ విషయం ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుదాం అంటూ నరేష్ తెలిపారు.
‘‘మా అధ్యక్ష పదవికి నేను పోటీ చేయడం లేదు. ఎవరు సరిగా బాధ్యతలు నిర్వర్తిస్తారో వారే ఆ పీఠం అధిరోహిస్తారు. ఇటీవల చిరంజీవిని కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించి నేనే చర్చించాను. కొంత సమయం తీసుకుని పెద్దలతో చర్చిద్దామని చిరంజీవి అన్నారు. సిల్వర్‌జూబ్లీ వేడుకలు ఏకపక్షంగా జరిగాయి. ఈ విషయంలో ఆలస్యంగా స్పందించడం నా తప్పే. ఈ అంశాన్ని ప్రభుత్వానికి అప్పగిద్దాం. విశ్రాంత న్యాయమూర్తులతో, ఉన్నతోద్యోగులతో నిజనిర్దారణ కమిటీ వేద్దాం. ఇందులో అనవసరంగా పెద్దల పేర్లు తీసుకుని వస్తున్నారు. ఈ విషయంలో ఏం జరిగిందో కూడా పెద్దలకు తెలియాలి. కాబట్టి పెద్దలను కలుస్తున్నాము..’’ అని నరేష్ చెప్పుకొచ్చాడు.
నిధులు దుర్వినియోగం అయ్యాయని నేను ఆరోపించడం లేదు. ఈ ఆరోపణలు వచ్చాయి కాబట్టి నిజనిర్దారణ కమిటీ వేద్దాం. ఇటీవల శివాజీరాజా ఫోన్ చేసిఎ న్నికలకు వెళ్దాం అన్నాడు. రెండ్రోజులు ఆలోచించుకుని చెప్పు. ఖచ్చితంగా వెళ్దామని తాను చెప్పానన్నాడు. నేను ఎన్నికల గురించి మాట్లాడటం లేదని ఆయన చెప్పుకొచ్చాడు. అయినా మా తో పాటు నిర్మాతల మండలి, ఫిల్మ్‌చాంబర్‌లలో కూడా యువరక్తం రావాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడులో నడిగర్ సంఘంలోకి, నిర్మాతల మండలిలోకి విశాల్ వంటి యువకులు, నిజంగా నేడు హీరోగా చేస్తూ నిర్మాతగా కూడా దూసుకెళ్తున్న నిజమైన వారు ఎంటర్ అయిన తర్వాత శింబు నుంచి పలువురి విషయంలో కఠినంగా మార్పులు తెచ్చి సాహసోసేత నిర్ణయాలు తీసుకుంటున్నారు.