తెలుగు మూవీ ఆర్టిస్ట్ వ్యవహారశైలిపై ఎప్పటి నుంచో తీవ్ర విమర్శలు ఉన్నాయి. గతంలో కూడా సినీ నటి ప్రత్యూష మరణం విషయంలో మా అసోసియేషన్ సరిగా స్పందించలేదని తీవ్ర విమర్శలు వచ్చినప్పుడు పలు పత్రికలు కూడా నాడు మా అధ్యక్షునిగా ఉన్న నాగార్జునను తీవ్రంగా తప్పుపట్టాయి. కానీ అలా ప్రశ్నించిన జర్నలిస్ట్‌లను పరిశ్రమ నుంచి వెలివేసి మా అసోసియేషన్ తనలో పారదర్శకత లేదని, వ్యక్తులను బట్టి మా పని తీరు ఉంటుంది అన్న విమర్శలు వచ్చాయి. ఇదే నియంతృత్వ పోకడ ఎన్నోసార్లు బయటపడింది.
మా అసోసియేషన్‌లో పలువురు పెద్దలు తెర ముందు కాకుండా తెరవెనుక చక్రం తిప్పుతూ మా అసోసియేషన్‌ని డైరెక్ట్‌గా తమ గుప్పిట్లో పెట్టుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు కూడా ఉన్నాయి. స్వర్గీయ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తాను బతికున్న రోజుల్లో నిర్మాతల మండలిలో గానీ, ఫిల్మ్‌చాంబర్‌లో గానీ, మా అసోసియేషన్‌లో గానీ నిజంగా సినిమాలలో బిజీగా ఉండి ప్రేక్షకులలో మంచి అభిమానం సాధించిన వారు ఎవరున్నారు? అంటూ నిలదీశాడు. ఇక తాజాగా కూడా మా అసోసియేషన్ తొందరపాటుగా శ్రీరెడ్డిని బహిష్కరించడం, ఆ తర్వాత మరలా ఆమెపై ఉన్న బ్యాన్‌ని ఎత్తివేయడం వంటివి మా దివాలాకోరు తనాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి.
ఇక ఇప్పుడు ఏప్రిల్‌లో మెగాస్టార్ చిరంజీవితో అమెరికాలో నిర్వహించిన మా సిల్వర్ జూబ్లీ వేడుకల్లో అవకతవకలు జరిగాయని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. హీరో శ్రీకాంత్‌కి స్నేహితులైన వారికి తక్కువ రేటుకి ఈ సభాబాధ్యతలు అప్పగించడంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. కేవలం మా అనేది కూడా ఫేడవుట్ ఆర్టిస్టులకు ఆశ్రమంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా మా అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ, మా నిధుల్లో ఐదు పైసలు కూడా దుర్వినియోగం కాలేదని, తాము పద్దతి ప్రకారమే నడుచుకున్నామని ఎవరైనా తమ తప్పుని నిరూపిస్తే శాశ్వతంగా మానుంచి నిష్ర్కమిస్తామని, తన ఆస్తినంతా మా అసోసియేషన్‌కి రాసిస్తానని ప్రకటించాడు.
మరి శివాజీరాజానే ఒకసారి స్పందిస్తూ తాను ఉదయ్‌కిరణ్, రంగనాథ్ వంటి వారి మరణం సమయంలో కొందరి నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నానని బహిరంగంగా చెప్పాడు. మరి ఆ విషయంలో శివాజీరాజా నిక్కచ్చి మనిషి అయితే తనని బెదిరించిన వారి పేర్లు ఎందుకు చెప్పడం లేదనేది కూడా కీలకంగా మారింది. మరోవైపు శివాజీరాజాకి అండగా కోశాధికారి పరుచూరి వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్‌లు మద్దతు ప్రకటించడం చూస్తే మా రెండుగా చీలిపోయిందనే వ్యాఖ్యలకు మరింత బలం చేకూరుతోంది. మరి ఈ విషయం చినికి చినికి ఎక్కడి దాకా వెళ్తుందో వేచిచూడాల్సివుంది...!