సాధారణంగా నందమూరి బాలకృష్ణ నటించే చిత్రాలలో నటించడానికి యంగ్ హీరోయిన్లు బాగానే ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి తరుణంలో తప్పని పరిస్థితుల్లో బాలయ్య సరసన నటించే హీరోయిన్లు ఫేడవుట్ అయిన వారు గానీ లేదా బాలీవుడ్‌లో పెద్దగా పేరు లేని వారు గానీ ఎక్కువగా నటిస్తూ ఉంటారు. గత బాలయ్య పది చిత్రాలను గమనిస్తే ఆయన హీరోయిన్ల విషయంలో పడుతున్న ఇబ్బంది బాగానే అర్ధమవుతుంది. ఇదే సమస్య మిగిలిన సీనియర్ స్టార్స్ అయిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లకు కూడా ఎదురవుతూనే ఉంది. అయితే చిరంజీవి విషయం పక్కనపెడితే నాగార్జున, వెంకటేష్‌లు తమ వయసుకు తగ్గ పాత్రలను, హీరోయిన్లను చాకచక్యంగా ఎంచుకుంటూ వస్తున్నారు.
కానీ ప్రస్తుతం బాలయ్య నటిస్తున్నతన తండ్రి ఎన్టీఆర్ 'బయోపిక్'లో మాత్రం కుర్రహీరోయిన్లను తీసుకోవడానికి బాగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ ఎన్టీఆర్‌గా నటిస్తుండటంతో తనకి జోడీగా అంటే తన తల్లి బసవతారకం పాత్రకి బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ని ఎంపిక చేసి మరీ భేష్ అనిపించారు. ఇక చంద్రబాబునాయుడు పాత్రకి దగ్గుబాటి రానా విషయంలో కూడా సమయస్ఫూర్తి చూపించారు. హరికృష్ణగా నందమూరి కళ్యాణ్‌రామ్ నటించనున్నాడు. ఇక ఎన్టీఆర్ జీవితం అంటే అందులో సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరికో స్థానం ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటి వరకు బాలయ్య చూపని శ్రద్దను ఈ చిత్రంపై చూపిస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న క్రిష్ జాగర్లమూడి కూడా తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు.
ఇక నాడు ఎన్టీఆర్‌తో కలిసి పలు చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన అందాల తార, అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవి పాత్రను రకుల్‌ప్రీత్‌సింగ్ చేయనుందని, ఎన్టీఆర్‌తో పాటు సినిమాలలో నటించిన మరో సీనియర్ హీరోయిన్, తర్వాత టిడిపిలో కూడా పనిచేసిన జయప్రద పాత్రకు రాఖిఖన్నాని తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని తాజాగా రాశిఖన్నా ఖండించింది. 'ఎన్టీఆర్ బయోపిక్‌లో జయప్రద పాత్రని పోషించమని ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు సంప్రదించలేదని' స్పష్టం చేసింది. ఇలాంటి బయోపిక్‌లో నటించాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. మరి ఆ అదృష్టం రాశిఖన్నాకి ఉందో లేదో వేచిచూడాల్సివుంది...!