అభిమానులు తమ హీరో పుట్టినరోజుకి, సినిమా విడుదల సందర్భంలో వివిధ రకాలుగా తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. కొందరు అన్నదానాలు, రక్తదానాలు వంటివి చేస్తే మరికొందరు పాలాభిషేకాలు, పంచామృత అభిషేకాలు, హీరో పేరుతో గుళ్లలో పూజలు నిర్వహిస్తారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కోశైలి. నిజంగా అంతటి వీరాభిమానులను సంపాదించుకోవడం కూడా మాటలు కాదు. దానిని పూర్వజన్మ సుకృతంగా భావించాలి.
ఇక కుటుంబ సభ్యులు కూడా ఆయా హీరోలకు మరిచిపోలేని గిఫ్ట్‌లు ఇస్తూ ఉంటారు. అయితే అవి వస్తురూపేణా, లేదా ధనరూపేణానే ఉండాల్సిన అవసరం లేదు. తాజాగా ఇదే విషయాన్ని తన బాబాయ్ పవన్‌కళ్యాణ్ జన్మదినోత్సం సందర్భంగా మెగా పవర్‌స్టార్‌గా అభిమానులు పిలుచుకునే రామ్‌చరణ్ చేసి చూపించాడు. ఏది చేసినా విభిన్నంగా ఉండాలని ఆలోచించే రామ్‌చరణ్ తన బాబాయ్ బర్త్‌డే కానుకగా ఎవ్వరూ చేయని సర్‌ఫ్రైజ్ గిఫ్ట్‌ని అందించాడు. దీని కోసం ఆయన ఓ సాహసపూరితమైన ఫీటుని చేసి ఔరా అనిపించాడు. ఇంతకీ రామ్‌చరణ్‌ఏమి చేశాడనే కదా... మీ అనుమానం. అదే విషయానికి వస్తున్నాం.
సినిమాలలో ఇప్పటికే 'మగధీర' వంటి చిత్రాలలో హెలికాప్టర్‌తో గాల్లో ఫీట్లు చేసిన రామ్‌చరణ్ తాజాగా తన బాబాయ్ పవన్ బర్త్‌డే సందర్భంగా స్కైడ్రైవింగ్ చేశాడు. పారాషూట్‌ని తగిలించుకుని గాల్లోకి ఎగిరిన చెర్రీ, నిమిషం పాటు గాల్లోనే చక్కర్లు కొడుతూ ల్యాండ్ అయ్యాడు. వెనుకనే నైపుణ్యం కలిగిన వ్యక్తి ఉన్నప్పటికీ ఈ వీడియోలో చరణ్ కొట్టిన చక్కర్లు మామూలుగా లేవు. బహుశా బాబాయ్‌పై తనకున్న అభిమానాన్ని ఇలా చాటాలనుకున్నాడు కాబోలు అని ఈ వీడియో చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. చెర్రీ ఇచ్చిన వెరైటీ విషెష్‌కి మెగాభిమానులు ఫిదా అవుతున్నారు. బాబాయ్ పైన చరణ్‌కి ఇంత అభిమానం ఉందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైనా సరే వెరైటీగా బాబాయ్‌కి చెర్రీ ఇచ్చిన గిఫ్ట్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి.