'మహానటి'తో సావిత్రి బయోపిక్ రూపొందిన తర్వాత ఇప్పుడు తెలుగులో కూడా బయోపిక్‌ల హవా నడుస్తోంది. ఒకవైపు ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్య నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రను ఆధారంగా చేసుకుని 'యాత్ర' అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం దర్శకుడు కేవలం ఒకే సినిమా అనుభవం ఉన్న వాడు అయినప్పటికీ ఇందులో వైఎస్‌గా మమ్ముట్టి వంటి వారు నటిస్తుండటం, ఇప్పటికే బయటకు వచ్చిన మమ్ముట్టి గెటప్, అభివాదం నుంచి లిరికల్ సాంగ్ వరకు అన్ని ఆకర్షిస్తూ ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఇక ఎప్పుడు మొదలైందో ఏమో గానీ ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌గా 'చంద్రోదయం' అనే చిత్రం షూటింగ్ చడీ చప్పుడు లేకుండా సాగుతోంది. తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేస్తున్నామని తెలుపుతూ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. కానీ ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని చూస్తూ ఉంటే టిడిపి ప్రచారంలో వాడే పోస్టర్‌లా ఉందేగానీ ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. ఇక దీనికి బయోపిక్ ఆఫ్ లివింగ్ లెజెండ్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ చిత్రం నిర్మాతలు గానీ, దర్శకులు గానీ ఎవ్వరూ సినీ పరిశ్రమకు పెద్దగా పరిచయం లేని వారు కావడం విశేషం. బయోపిక్ అంటే అది చంద్రబాబు ఆమోద ముద్రతోనే రూపొందుతోందని భవించాల్సివుంది. ఒకవైపు నందమూరి బాలయ్య, మరోవైపు నారా రోహిత్ వంటి వారితో పాటు కె.రాఘవేంద్రరావు, బోయపాటి, రాజమౌళి వంటి ఎందరితోనో మంచి సత్సంబంధాలు, మురళీమోహన్, అంబికాకృష్ణ, చెంగల వెంకట్రావ్ వంటి ఎందరో చంద్రబాబుకి ఎంతో సన్నిహితులు అయినా ఈ బయోపిక్‌ని ఏమాత్రం పెద్దగా అనుభవం లేని వారి చేతిలో పెట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
బహుశా ఈ 'చంద్రోదయం'తో పాటు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 'యాత్ర' కూడా అక్టోబర్‌లోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజశేఖర్‌రెడ్డి కూడా తాను బతికి ఉన్నప్పుడు పవన్‌కళ్యాణ్‌తో 'తమ్ముడు' చిత్రం తీసిన అరుణ్‌ప్రసాద్ దర్శకత్వంలో బ్రహ్మానందం, వైఎస్ కలిసి ఓ మూకీ చిత్రంలో నటించారు. ఈ చిత్రం విడుదల కూడా కాలేదు. మరి ఈ 'చంద్రోదయం'కి ఎలాంటి గతి పడుతుందో వేచిచూడాల్సివుంది..!