ఎవరి జీవితంలోనైనా యవ్వనంలో ఉండే తొలిప్రేమ అనేది అనిర్వచనీయమైన అనుభూతి అనే చెప్పాలి. అలాగని తొలిప్రేమ కలిగిన వారితోనే జీవితంలో కూడా స్ధిరపడతామనే నమ్మకం లేదు. ఆ వయసు అలాంటిది. అలా తొలి చూపులోనే ప్రేమలో పడిన వారే భార్యాభర్తలు కావడం అరుదుగా మాత్రమే జరుగుతుంది. ఇక విషయానికి వస్తే జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ కెరీర్‌ని ఓ అద్భుతమైన మలుపు తిప్పిన చిత్రం ‘తొలిప్రేమ’. ఇక పవన్ నిజజీవితం తొలిప్రేమ విషయానికి వస్తే ఆయన తన అన్నయ్య చిరంజీవి హీరోగా వెలుగుతున్న రోజుల్లో కొంతకాలం చెన్నైలో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన కంప్యూటర్ క్లాస్‌కి కూడా వెళ్లేవాడు. ఆరోజుల్లో ఏర్పడిన తొలి ప్రేమ గురించి పవన్ తాజాగా తన అభిమానులతో ఆ మధురానుభూతులను పంచుకున్నాడు.
పవన్ తనతోపాటు కంప్యూటర్ క్లాస్‌కి వచ్చే ఒక అమ్మాయిని ఎంతగానో అభిమానించాడట. ఆమె కూడా పవన్‌తో ఎంతో సన్నిహితం ఉండేదని చెప్పుకొచ్చాడు. కంప్యూటర్ క్లాస్‌లు కొనసాగుతున్న కొద్ది ఇద్దరి మధ్య పరిచయం కూడా బాగా పెరిగింది. మా మద్య చనువు చూసిన నా ఫ్రెండ్స్ ఇది స్నేహం కాదు. ప్రేమే అని చెప్పి త్వరలోనే నా మనసులోని మాటను ఆ అమ్మాయికి చెప్పేయమని బలవంతం చేశారు. దాంతో ఇంట్లో ఎవ్వరూ వాడకుండా మూలన పడేసిన కారును తీసుకుని దుమ్ముదులిపి దానిని డ్రైవ్ చేసుకుంటూ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి లిఫ్ట్ ఇస్తాను అని చెప్పాను. ఆమె కారు ఎక్కింది. దారిలో ఒకచోట ఆపి నా మనసులోని మాటను చెప్పేశాను.
అంతా విన్న ఆ అమ్మాయి ఈ వయసులో ప్రేమేంటి? అసలు ప్రేమంటే ఏమనుకుంటున్నావ్? అంటూ క్లాస్ పీకింది. ఆ సమయంలో ఆమె నాకు హితబోధ చేస్తోన్న టీచర్‌లా కనిపించింది.. అంటూ చెప్పుకొచ్చాడు పవన్‌కళ్యాణ్. మొత్తానికి పవన్ టీనేజ్‌లో ఓ ‘సుస్వాగతం’ వంటి ప్రేమ కథ ఉందని అందరికీ ఆయన మాటల వల్ల తెలిసింది. రాజైనా బంటైనా ప్రేమకు దాసుడే అని పెద్దలు అందుకే చెప్పారు.