పెద్ద పెద్ద కొండలు, కోనల వద్ద, జలపాతాల మధ్య షూటింగ్ చిత్రీకరణ జరపాలంటే ప్రమాదాలతో చెలగాటం ఆడటమే. ఇలాంటి వాటి వల్లే గొల్లపూడి మారుతిరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాస్ వైజాగ్‌లో సముద్రపు రాకాసి అలలకు బలైపోయాడు. ఇక ఇటీవల ఓ ఫైటింగ్ సీన్‌ని చిత్రీకరించే సమయంలో కన్నడ పరిశ్రమకు చెందిన ఇద్దరు డూప్‌లు హెలికాప్టర్ నుంచి జలపాతంలోకి దూకి ప్రాణాలు తీసుకున్నారు. రవితేజ డూప్ 'బలాదూర్' చిత్రం షూటింగ్ సమయంలో గోదావరి నదిలో మునిగిపోయి మరణించాడు. ఇలాంటి రిస్క్ చేసేటప్పుడు ఎవరికైనా భయం అనిపించడం సహజం.
ఇక విషయానికి వస్తే 'అవళుక్కెన్న ఆళగియ ముగం' నటిస్తున్న నటి అనుపమా ప్రకాష్ షూటింగ్ స్పాట్ నుంచి అదృశ్యమైపోయి యూనిట్ సభ్యులకు ముచ్చెమటలు పోయించింది. దీనిపై యూనిట్ ఆరాతీయగా ఎత్తైన కొండపై మరో ఎత్తైన ప్రాంతంలో తనచేత ఎంతోరిస్కీ అనిపించే నృత్యాలు చేయిస్తూ ఉండటంతో ఆమె భయపడి పోయి అక్కడి నుంచి అదృశ్యమైపోయిందని తెలిపింది. దీంతో ఆమె తన స్వస్థలానికి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిందని యూనిట్‌కి సమాచారం అందింది. కదివరన్ స్టూడియోస్ బేనర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ఎ.కేశవన్ దర్శకత్వం వహిస్తుండగా వైరముత్తు పాటలు రాస్తున్నాడు. ఇందులోని కీలకమైన సన్నివేశాలను కోడైకెనాల్‌లో చిత్రీకరిస్తున్నారు. ఎత్తైన ప్రాంతాలలో షూటింగ్ జరుపుతూ ఉండటంతో ఆమె భయభ్రాంతులకి లోనైంది. అనూహ్యంగా ఎవ్వరికీ చెప్పకుండా షూటింగ్ నుంచి తన హోటల్ గదికి వెళ్లిపోయిన ఆమె ఆ తర్వాత మదురై చేరుకుని తన స్వస్థలం అయిన న్యూఢిల్లీకి విమానంలో వెళ్లిపోయింది.
ఈ విషయం తెలియని యూనిట్ సభ్యులు ఆమెకోసం పలు చోట్ల వెతికారు. గాలించిన వారికి ఆమె ఢిల్లీలో ఉన్నట్లుగా తెలిసి కాస్త స్థిమిత పడ్డారు. నిర్మాత వెళ్లి బతిమాలడంతోనే ఆమె మరలా షూటింగ్‌కి వచ్చింది. దీంతో చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది.