ఇటీవల ఆపదల్లో, ఆర్దిక కష్టాలలో ఉన్న వారి కోసం మంచు లక్ష్మీప్రసన్న 'మేము సైతం' అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, రానా, రకుల్‌ప్రీత్‌సింగ్, సమంత వంటి పలువురి చేత ఆటోలు నడిపించడం, పెట్రోల్ కొట్టించడం, కూరగాయలు అమ్మడం వంటివి చేసింది. ఇక స్వతహాగా అక్కినేని కోడలైన సమంతకు సామాజిక స్పృహ బాగా ఎక్కువనే చెప్పాలి. ఈమె ఈ విషయంలో తన మావయ్య నాగార్జున, భర్త నాగచైతన్య కంటే ఓ అడుగు ముందుకేస్తోంది. పిల్లల పౌష్టికాహారం కోసం కూడా పలు స్వచ్చంధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఈ స్ఫూర్తితోనే కాబోలు ఆమె తాజాగా తన సొంతూరు అయిన చెన్నైలోని ఓ కూరగాయల మార్కెట్‌లో కూరగాయలను అమ్మి అందరినీ ఆశ్చర్యపరిచింది. చెన్నై నగరంలోని తిరువళ్లికేణి కూరగాయల మార్కెట్‌లో ఆమె కూరగాయలు అమ్మింది. ఇక్కడ ప్రసిద్ది చెందిన జాంబజార్ మార్కెట్‌లో ఆమె ఓ కూరగాయల దుకాణం వరకు వెళ్లి ఓ మహిళా కూరగాయల వ్యాపారిని కలిసి తనకు కూరగాయలు అమ్మాలని ఉన్న ఆకాంక్షను బయటపెట్టింది. ఆమె సరేననడంతో సమంత వెంటనే కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. విషయం తెలిసిన వెంటనే వినియోగదారులు ఆమె దుకాణానికే వెళ్లి కూరగాయలను వేలం వెర్రిగా కొనుగోలు చేశారు.
దాంతో అతి తక్కువ సమయంలోనే ఆ దుకాణంలో ఉన్న కూరగాయలన్నీ అమ్ముడుపోయాయి. సమంత నటనతో పాటు ప్రజాసేవ కూడా బాగా చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గుండె వ్యాధులతో బాధపడుతున్న పలువురు చిన్నారులకు ఆమె ఆర్దికసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసమే సమంత ఈ కూరగాయలను అమ్మి డబ్బును కూడబెట్టినట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.