తమన్నా. ఈమె 2005లో బాలీవుడ్‌లో విడుదలైన 'చాంద్‌సా రోషన్‌చెహ్రా'తో నటిగా మారి తెలుగులో మంచు మనోజ్ నటించిన 'శ్రీ' చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయం అయింది. ఇలా దశరథ్ చేతుల మీదుగా పరిచయమైన ఆమె ఆ తర్వాత 'జాదూ' చిత్రంలో నటించినా అది అసలు విడుదలైందో లేదో కూడా తెలియదు. ఆ సమయంలో శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీడేస్' ద్వారా పెద్ద హిట్‌ని అందుకుంది. 100%లవ్, రచ్చ, ఊసరవెల్లి, రెబెల్, కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి పలు చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ అయింది.
ఈమె తాజాగా మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి టైమ్ కలిసి రావాలి. ఆ విషయంలో నేను ఎంతో అదృష్టవంతురాలినేనని చెప్పాలి. చాలా తక్కువ సమయంలో నేను ఇక్కడ నిలదొక్కుకున్నాను. పన్నెండు పదమూడేళ్ల సుదీర్ఘ సినీ కెరీర్‌లో ఎన్నో చిత్రాలు చేసుకుంటూ వచ్చాను. ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రాలు ఆడని సందర్భాలు, పెద్ద అంచనాలు లేకుండా చేసిన చిత్రాలు భారీ విజయం సాధించడం జరిగాయి. హిందీలో నేను చేసిన 'హిమ్మత్‌వాలా'తో పాటు పలు చిత్రాలు నాకు ఎలాంటి పేరును తీసుకుని రాలేదు.
తెలుగులో నటించిన 'బాహుబలి' చిత్రం హిందీలో కూడా విడుదల కావడంతో నాకు అక్కడ బాగా క్రేజ్ వచ్చింది. అనుకున్నవి జరగకపోవడం, అనుకోనివి జరగడం వంటివి ఇక్కడ ఎప్పటికప్పుడు అనుభవంలోకి వస్తూ ఉంటాయి.. అంటూ తెలుగు తెరకి లేత సోయగాలను రుచి చూపించిన మిల్కీబ్యూటీ తమన్నా చెప్పుకొచ్చింది. అయినా పుష్కరకాలం కెరీర్ అంటే అది అందరికీ సాధ్యమయ్యే పని కాదనే చెప్పాలి.