సినీ హీరోయిన్ల వివాహాల మీద వార్తలు వస్తూ వారంతా అంతా గాసిప్స్ అని, చీ మీడియా ఇంతేనని ఈసడించుకుంటారు ఎవరినైనా వివాహం చేసుకుంటే ముందే చెప్పి చేసుకుంటామని అంటూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలోనే అనుష్కశర్మ, శ్రియశరణ్ వంటి ఎందరో ఇలాంటి మాటలే చెప్పి తర్వాత గుట్టుచప్పుడులేకుండా వివాహం చేసుకున్నారు. ఇక స్వతహాగా తెలుగు నటే అయినప్పటికీ తమిళం, మలయాళం భాషల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కలర్స్ స్వాతి అలియాస్ స్వాతి రెడ్డి. ఈమె పుట్టింది సోవియెట్ యూనియన్‌లో. ఈమె తండ్రి ఇండియన్ నేవీలో రష్యాలో సబ్‌మెరైన్ ఇంజనీర్‌గా పనిచేస్తాడు.
ఇక ఈమె చిన్నతనంలోనే 'మా' టీవీలో ప్రసారమైన కలర్స్ ద్వారా అందరినీ ఆకట్టుకుంది. ఇక సినిమా రంగంలోకి ప్రవేశించి తమిళ, మలయాళ భాషల్లో ఎంతో నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో నటించింది. కానీ తెలుగులో మాత్రం ఈమె సత్తాకి తగ్గ పాత్రలు సరిగా రాలేదనే చెప్పాలి. 'స్వామిరా..రా, కార్తికేయ, అష్టాచెమ్మా, డేంజర్' వంటి పలు చిత్రాలలో నటించింది. తాజాగా ఈమె తన ప్రియుడు వికాస్‌ని వివాహం చేసుకుంది. మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో పైలెట్‌గా పనిచేస్తున్న వికాస్‌తో తాజాగా ఆమె వివాహం జరిగింది. తమ ప్రేమకు తల్లిదండ్రులను ఒప్పించి పెద్దల అంగీకారంతో ఈమె వికాస్‌ని వివాహం చేసుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. ఇరు కుటుంబాల సమక్షంలో ఈమె ఒక ఇంటిదైంది.
ఇక రేపు ఈ జంట కొచ్చిలో భారీగా రిసెప్షన్‌ని ఇవ్వనుంది. నటిగా, యాంకర్‌గా, ప్లేబ్యాక్ సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా పలు రంగాలలో రాణించిన ఆమె పెళ్లి తర్వాత ఏం చేయబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది. నటిగా తన కెరీర్‌ని కొనసాగిస్తుందా? లేక కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ గృహిణిగానే ఉంటుందా? అనేది వేచిచూడాల్సివుంది...!