భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డిల కుమార్తె, ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియ వివాహం ఆళ్లగడ్డలో వేడుకగా జరిగింది. పారిశ్రామికవేత్త భార్గవ్‌రామ్‌తో ఆమె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు హాజరుకావాల్సివుంది. కానీ నందమూరి హరికృష్ణ హఠాన్మరణంతో ఎవ్వరూ ఈ వేడుకకు హాజరుకాలేదు. సీఎం చంద్రబాబు కూడా షెడ్యూల్ ప్రకారం ఈ వేడుకకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ హరికృష్ణ మరణంతో ఆయన కూడా హాజరుకాలేదు. చిరంజీవి నుంచి బాలకృష్ణ వరకు ఈ వేడుకకు ఎవ్వరూ హాజరు కాకపోవడంతో వేడుక కళతప్పిందనే చెప్పాలి.
మరోవైపు ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు బదులుగా మంత్రులు నారాయణ, కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక బాగా జరిగింది. ఇక హరికృష్ణ మరణంపై ఆయనతో కలిసి నటించిన భానుప్రియ స్పందించింది. హరికృష్ణ ఎంతో సింపుల్‌గా, కలుపుగోలుగా ఉంటారని, ఆయన మరణ వార్త విని షాక్‌కి గురయ్యానని చెప్పుకొచ్చింది. ఆయన లేరన్న విషయం మర్చిపోలేకపోతున్నాను. చాలా మంచి మనిషి. ఎంతో కలుపుగోలుగా ఉండేవారు. సెట్‌లో సింపుల్‌గా సరదాగా ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపింది. హరికృష్ణ, భానుప్రియ జంటగా నటించిన 'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రం ఇద్దరికీ మంచి పేరును తీసుకుని వచ్చింది.
ఇక హరికృష్ణ మరణంపై బాలకృష్ణ మాట్లాడుతూ, అన్నయ్య లేకపోవడం తమ కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి, కార్యకర్తలకు, నందమూరి అభిమానులకు తీరని లోటు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరం. హరికృష్ణకి బంధుప్రీతి ఎక్కువ. మా ఊరు వెళ్లినప్పుడు అందరినీ పేరు పేరునా పిలిచేవారు. పార్టీలో కూడా కలుపుగోలుగా ఉండేవారు. ఆయన మన మధ్య లేరంటే నమ్మశక్యంగా లేదు. సంస్కృతి, సంప్రదాయాలకు విలువ ఇచ్చేవారు. మా ఇంట్లో ఏ వేడుక జరిగినా వచ్చేవారు. హరికృష్ణని చూస్తుంటే మా తండ్రిని చూస్తున్నట్లే ఉండేది. అందరం పోవాల్సిన వాళ్లమే. కానీ ఈ విధంగా మరణించడం మాత్రం ఎంతో బాధగా ఉందంటూ బాధాతప్త హృదయంతో మాట్లాడారు.