ప్రస్తుతం 'ఎన్టీఆర్' బయోపిక్‌గా రూపొందుతున్న చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి హోమ్‌వర్క్ చేస్తుండటం వల్ల కాబోలు క్రిష్ చేతికి ఒక అరుదైన పిక్ లభించింది. దానిని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఇక నందమూరి హరికృష్ణ మరణంతో చిత్ర పరిశ్రమ మొత్తం స్తంభించిపోయింది. చిత్రసీమను ఇది విషాదంలో ముంచెత్తింది. దీనితో సినీ ప్రముఖులు అందరు సోషల్ మీడియా వేదికగా తమ సానుభూతిని తెలుపుతూ సంతాప సందేశాలు పంపుతున్నారు. ఈ సందర్భంగా 'చిన్నపిల్లాడిగా ఉన్న హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ ముందు నడుస్తున్న అరుదైన ఫొటొని క్రిష్ షేర్ చేస్తూ, మార్పుకోసం రామరథ చక్రాలు నడిపిన చైతన్యరథసారధి, చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం' అంటూ ట్వీట్ చేశాడు. 1962లో దేశరక్షణ కోసం విరాళాలు సేకరిస్తున్న ఎన్టీఆర్ ముందు నడుస్తున్న హరికృష్ణ అని తెలిపాడు.
ఇక నందమూరి కుటుంబానికి ఎంతో కావాల్సిన దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి. ఆయన తన దర్శకత్వంలో తీసిన 'సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య'వంటి చిత్రాలలో హరికృష్ణ నటించాడు. హరికృష్ణ మృతి సందర్భంగా వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ, హరికృష్ణ అనుమతితోనే బొమ్మరిల్లు బేనర్ పుట్టింది. ఆయన లేకపోతే ఈ సంస్థే లేదు. నాపై నమ్మకం ఉంచి నన్ను నిలబెట్టారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి నన్ను ఆదరించి, అభిమానించే వ్యక్తి హరికృష్ణ. హరికృష్ణ గారు నన్ను సోదరునిలా చూసేవారు. ఆయనతో నాకు ఎంతో ఆత్మీయత, అనుబంధం ఉన్నాయి. నేను వారి కుటుంబ సభ్యుడినేమో అన్నంతగా ఆయన నాతో సన్నిహితంగా ఉండేవారు. హరికృష్ణను మేము 'టైగర్' అని పిలుచుకునేవారం. హరికృష్ణ లేనిలోటు పూడ్చలేనిది అని చెప్పుకొచ్చాడు.
ఇక పవన్‌కళ్యాన్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించడం ఎంతో దురదృష్టకరం. చాలా బాధగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్‌రామ్‌లకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఆయనకు ఆత్మకుశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర విభజన సమయంలో హరికృష్ణ తన రాజ్యసభకు రాజీనామా చేసిన విషయాన్ని, ఆ సందర్భంగా రాజ్యసభలో తెలుగులో మాట్లాడిన ఆయనను మరిచిపోలేమని పవన్‌కళ్యాణ్ నివాళులర్పించారు.