ప్రస్తుతం తెలుగులో మరలా మల్టీస్టారర్స్ హవా నడుస్తోంది. యంగ్‌స్టార్స్ కలిసి అసలు సిసలైన మల్టీస్టారర్స్ చేయబోతున్నారు. త్వరలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి ఓ భారీ మల్టీస్టారర్ తీయనున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో యంగ్ హీరోలు కూడా మల్టీస్టారర్స్ చేస్తున్నారు. మరోవైపు నాగార్జున.. నానితో కలిసి, వెంకటేష్- నాగచైతన్య, వరుణ్‌తేజ్‌లతో కలిసి సినిమాలు చేస్తున్నారు. మరికొందరు స్టార్స్ తమకి నచ్చిన కథలు వస్తే మల్టీస్టారర్స్ చేయడానికి రెడీ అంటున్నారు. కానీ యంగ్ హీరో నాగశౌర్య మాత్రం తాను మల్టీస్టారర్స్ చేయనని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
గతంలో నారా రోహిత్‌తో ఉన్న సాన్నిహిత్యం కొద్ది ఆయనతో కలిసి నటించానని ఇకపై మాత్రం మల్టీస్టారర్ చిత్రాలు చేయనని చెప్పుకొచ్చాడు. అయినా మల్టీస్టారర్ అని చెప్పడానికి నాగశౌర్య కేవలం యంగ్ హీరోనే గానీ స్టార్ కాదు కదా...! అనే అనుమానం మాత్రం రాకమానదు. ఇలాంటి మల్టీహీరోల చిత్రాలలో తన పాత్రకి తగిన ప్రాధాన్యం లభిస్తుందో లేదో అనే సంశయంతోనే సోలో హీరోగా మరికొంత స్థాయికి ఎదిగే వరకు ఆయన ఇలాంటి చిత్రాలలో చేయదలుచుకోలేదని తెలుస్తోంది. ఇక నర్తనశాలకు ముందు ఎట్‌ది రేట్ ఆఫ్ అనే సింబల్‌ని తగించడానికి కారణం గతంలో బాలకృష్ణ కంటే ముందు ఎన్టీఆర్, ఆతర్వాత బాలకృష్ణలు కూడా నర్తనశాల అనే పేరుతో చిత్రం తీయాలని భావించి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారని, ఆ సెంటిమెంట్‌ని లేకుండా చేయాలనే ఈ చిత్రం ముందు ఆ గుర్తును తానే పెట్టించానని నాగశౌర్య చెప్పుకొచ్చాడు.
మరోవైపు ఆయన ఇటీవల మాట్లాడుతూ.. ఇకపై స్టార్ స్టేటస్ ఎవరికీ రాదు. అది రామ్‌చరణ్‌తోనే ఆగిపోయిందని ఆయన చేసిన కామెంట్స్ విజయ్‌దేవరకొండని ఉద్దేశించి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దానిపై ఆయన వివరణ ఇచ్చాడు. స్టార్ స్టేటస్ అనేది ఒకటి రెండు రోజుల్లో వచ్చేది కాదు. ఆ స్థాయిని అందుకోవడానికి చిరంజీవిగారికి ఎంతో కాలం పట్టింది. పవన్ సినిమా ఫ్లాప్ అయినా 80కోట్లు వసూలు చేస్తోంది. అది స్టార్ స్టేటస్ అంటే.. అనేది తన అభిప్రాయంగా చెప్పారు. కానీ దీనిని నేను విజయ్‌దేవరకొండను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలుగా పలువురు భావిస్తున్నారు. ఒక్క విజయ్‌దేవరకొండను మాత్రమే కాదు.. నేను ఎవ్వరినీ ఉద్దేశించి ఆ కామెంట్స్ చేయలేదు అని నాగశౌర్య క్లారిటీ ఇచ్చాడు.