తెలుగులో అగ్రదర్శకులతో, నిర్మాతలతో, హీరోలతో ఎన్నో చిత్రాలు చేసిన ఘనత అగ్ర రచయితలైన పరుచూరి బ్రదర్స్‌కి ఉంది. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన మాటల్లో రోజా గురించి పలు విశేషాలను చెప్పుకొచ్చారు. ‘సర్పయాగం’ చిత్రంలో శోభన్‌బాబు గారి కూతురి పాత్రకు రోజాను తీసుకోవాలని భావించాం. కానీ రామానాయుడు గారు మాత్రం అప్పుడు ‘సీతారామయ్యగారి మనవరాలు’ విడుదలై ఉండటంతో మీనా అయితే బాగుంటుందని భావించారు. కానీ మేము మాత్రం రోజాని పెట్టుకుందాం. ఈమె భవిష్యత్తులో టాప్ హీరోయిన్ అవుతుంది. మనం డేట్స్ అడిగినా ఇవ్వలేని స్థాయికి ఎదుగుతుందని ఒప్పించాం. ఈ చిత్రాల తర్వాత రోజా ‘సీతారత్నం గారి అబ్బాయి, ముఠామేస్త్రి’ చిత్రాలలో నటించి బిజీ అయిపోయింది. ఆ సమయంలో ఇక ఆమెకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం కనిపించలేదు.
ఇక అదే సమయంలో గద్వాల్‌రెడ్డిగారు వెంకటేష్‌తో ‘పోకిరి రాజా’ తీసే సన్నాహాలలో ఉన్నారు. ఆయన హీరోయిన్‌గా రోజా అయితే బాగుంటుందని అనిపించి రామానాయుడు గారి ద్వారా ఆమెకి ఫోన్ చేయించారు. కానీ ఆమె అప్పటికే తెలుగులో పదికిపైగా, తమిళంలో ఆరేడు చిత్రాలలో నటిస్తోంది. ఏ హీరోయిన్‌కైనా ఒకేసారి అన్ని చిత్రాలు చేయడం అంటే ఈజీ కాదు. దాంతో ఆమె డేట్స్ లేవని చెప్పింది. దాంతో రామానాయుడు గారు మాకు చెప్పారు. మేము ఫోన్ చేసి రోజాని ఎలాగోలా ఒప్పించాం. ఇక ఆమె బాలీవుడ్‌లో కూడా శ్రీదేవిలా దూసుకుపోతుందని మేము భావించాం. అదే సమయంలో ఆమె ‘సంభవం’ చిత్రం ఒప్పుకుంది. విజయశాంతి ‘కర్తవ్యం’లా చేయాలని భావించి షూటింగ్‌లో గాయం పాలైంది. దాంతో మేము ఆమెపై కేకలేశాం. నువ్వు ఇలా కాలు విరగొట్టుకుంటే ఎలా అని అరిచాం. ఆ సమయంలో ఆమె రెస్ట్ తీసుకోవడం వల్ల బరువు బాగా పెరిగింది. దాంతో ఆమె మరలా మామూలుగా తయారు కావడానికి కొన్నేళ్లు పట్టింది.
అదే ఆమె అదే స్పీడ్‌తో సినిమాలు చేసి ఉంటే అతి తక్కువ సమయంలోనే రెండొందలు, మూడొందల చిత్రాలు ఖచ్చితంగా చేసి ఉండేది. అయినా భారతీయ సినీ పరిశ్రమంలో కేవలం 10ఏళ్లలోనే 100 చిత్రాలకు పైగా నటించిన తొలి హీరోయిన్ రోజా మాత్రమే అని మేము నమ్ముతున్నామని చెప్పుకొచ్చాడు. అయితే పోకిరి రాజా షూటింగ్‌లో తనని ముంబై షూటింగ్‌కి పిలిపించి రెండు మూడు రోజులు ఖాళీగా ఉంచడంతో రోజా అలిగి వెళ్లిపోయిందని, దాంతో వెంకటేష్ కూడా ఇక ఆమెతో నటించకూడదని భావించాడనే విషయంలో కూడా వాస్తవం ఉంది అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతాయి.