వెర్రి అభిమానం, వెర్రిద్వేషం అనేవి నేటి తరంలో జడలు విప్పుకుంటున్నాయి. వ్యక్తిగత దూషణలే తప్పు అని చెబుతున్నా, వెర్రి అభిమానం,ద్వేషంతో వారి కుటుంబసభ్యులను కూడా పరిహసించేలా తీవ్రమైన పనులు చేస్తూ సమాజంలో ఒకరి మద్య ఒకరికి ద్వేషాన్ని నింపుతున్న వారు ఎక్కువైపోతున్నారు. దీనిని నేడు తప్పు అని ఎవరైనా ఖండించకపోతే భవిష్యత్తులో వారికి కూడా అవే పరిస్థితులు ఎదురవుతాయి. ఎవరినైనా ద్వేషించి వారి కుటుంబసభ్యుల గురించి హేయంగా అమానవీయంగా సంఘటనలకు పాల్పడేవారు అదే స్థానంలో తమ తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు ఉంటే ఎలా ఉంటుందో అనే విచక్షణను కోల్పోతున్నారు.
సామాజిక మాధ్యమాల వల్ల ఎంత మంచి ఉందో.. అంత చెడు కూడా ఉందని తాజా సంఘటలనే నిరూపిస్తున్నాయి. తాజాగా పవన్‌కల్యాణ్ తల్లి ఫొటోని మార్ఫింగ్ చేసి, అసభ్యకరరీతిలో సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన వైనం సంచలనంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం చంటబ్బాయ్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి వీటిని పోస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ ఫొటోని చూసిన శ్రావణ్ అనే వ్యక్తి ఈ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఆకేసును పోలీసులు సైబర్ క్రైమ్‌కి బదిలీ చేశారు. విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు..ఫొటోని పోస్ట్ చేసిన కంప్యూటర్ ఐపీ నెంబర్‌ని కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు ఈ సంఘటనపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.
పవన్ తల్లిని వివాదంలోకి లాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కుటుంబ సభ్యులపై జరుగుతున్న విషప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఈ తాజా కలకలం ఏ పరిణామాలకు దారి తీస్తుందో అనే ఆందోళన మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది.