యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అరవింద సమేత - వీరరాఘవ షూటింగ్ మొన్నటివరకు విరామమే లేకుండా శరవేగంగా చిత్రీకరించారు. దసరా టార్గెట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇప్ప్పుడు బిగ్ బ్రేక్ వచ్చేలా కనబడుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ నిన్న బుధవారం ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు విడవడంతో... ఎన్టీఆర్ కి పెద్ద షాక్ తగిలింది. తండ్రి హఠాన్మరణంతో ఎన్టీఆర్ దు:ఖ సాగరంలో మునిగిపోయాడు. తండ్రి యాక్సిడెంట్ వార్త విని తన అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి నార్కట్ పల్లిలోని కామినేనికి వెళ్లి తండ్రి భౌతిక కాయాన్ని హైదరాబాద్ కి తీసుకురావడం దగ్గరనుండి... ఆయన అంత్యక్రియల వరకు ఏదీ జీర్ణించుకోలేని ఎన్టీఆర్ చాలా దుఃఖంలో మునిగిపోయాడు.
మరి విరామం లేకుండా షూటింగ్ జరుపుకున్న అరవింద సమేత ఇప్పుడు హరికృష్ణ మరణంతో షూటింగ్ కి బ్రేక్ పడవచ్చు. హరికృష్ణ అంతిమ సంస్కారాలు, దశదిన కర్మలు అన్ని ముగిసేవరకు అరవింద కోసం ఎన్టీఆర్ టైం కేటాయించే అవకాశం ఉండకపోవచ్చు. తండ్రి హరికృష్ణ అంటే ఎన్టీఆర్ కి ఎంతిష్టమో టెంపర్, నాన్నకు ప్రేమతో, జై లవ కుశ సినిమాల ఈవెంట్స్ టైం లో మీడియా ముఖంగా తెలిపాడు. మరి తండ్రి మరణాన్ని జీర్ణించుకుని ఎన్టీఆర్ అరవింద సమేత షూటింగ్ కి హాజరవుతాడో? లేదంటే కాస్త విరామం తీసుకుని వస్తాడో? అయితే షూటింగ్ కి చిన్నపాటి విరామం ఏర్పడినా భారీ ప్రాజెక్ట్ కాబట్టి నిర్మాతలకు లాస్ రాకుండా విడుదల డేట్ టైం కి సినిమాని ఎలాగైనా పూర్తి చెయ్యాలని త్రివిక్రమ్ అండ్ అరవింద సమేత యూనిట్ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ కి కాస్త విరామం ఇచ్చినా.. ఈలోపు త్రివిక్రమ్ అరవింద పోస్ట్ ప్రొడక్షన్ మిగతా పనులను చూసుకుంటూ... అనుకున్న టైం కే అంటే దసరాకే సినిమాని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తాడంటున్నారు.