90 ల దశకంలో అగ్ర కథానాయకుల బెస్ట్ చాయిస్ గా నిలిచిన దర్శకుడు రవిరాజా పినిశెట్టి. ఆయన వారసుడిగా వెండితెరకి ఒక విచిత్రం చిత్రంతో పరిచయమైన ఆది పినిశెట్టి తొలి ప్రయత్నంతో ఎదురు దెబ్బ తినాల్సి వచ్చింది. అప్పటి నుంచి తెలుగులో హీరోగా నిరూపించుకోవటానికి అడపా దడపా శ్రమిస్తూనే వున్నాడు పాపం.
ఈ మధ్య కాలంలో సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం వంటి విజయవంతమైన చిత్రాలలో కీలక పాత్రలలో మెప్పించిన ఆది పినిశెట్టి నటుడిగా తెలుగు ప్రేక్షకులకి బాగా చేరువయ్యాడు. ఆ క్రేజ్ ని కాష్ చేసుకునే ప్రయత్నంగా నిన్ను కోరి నిర్మాతలు ఆది కథానాయకుడిగా నీవెవరో చిత్రాన్ని రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
ఆ మధ్య మలుపు అనే అనువాద చిత్రంలో హీరోగా కనిపించినప్పుడు తెలుగు ప్రేక్షకులు ఆదికి మంచి ఫలితాన్నే ఇవ్వటం కూడా నిర్మాతల ఆశకు తెర లేపి ఉండవచ్చు. కానీ స్ట్రెయిట్ సినిమాగా వచ్చిన నీవెవరో మాత్రం మిక్స్డ్ టాక్ తో ఓపెన్ అయ్యి పేలవమైన వసూళ్లతో నిర్మాతలకి నష్టాల్ని, ఆదికి నిరాశని మిగిల్చింది. ఆది హీరోగా తెలుగు ప్రేక్షకులకి చేరువ కావటానికి మరో అద్భుతమైన కథ దొరికే వరకు ఎదురు చూడాల్సిందే మరి.