తమిళస్టార్ సూర్యకి తెలుగులో కూడా స్టార్ స్టేటస్ ఉంది. అయితే ఈయనకు గత కొంతకాలంగా సరైన హిట్ రాలేదు. '24' చిత్రం వైవిధ్యంగా ఉండి ఆకట్టుకున్నా కూడా ఈ చిత్రం తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. ఇక ఆ తర్వాత ఆయన తాజాగా నటించిన 'గ్యాంగ్' చిత్రం ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రం ప్రమోషన్స్ విషయంలో సూర్య తెలుగులో ప్రత్యేక శ్రద్ద పెట్టాడు. ఆయన ఉభయగోదావరి జిల్లాలలో చిత్రం ప్రమోషన్స్ నిర్వహిస్తున్న సమయంలో అభిమానుల తాకిడి భరించలేక ఆయన ఏకంగా గోడ దూకి పారిపోయిన విషయం తెలిసిందే.
కాగా ప్రస్తుతం ఆయన సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయనకు జోడీగా రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవిలు నటిస్తున్నారు. సూర్య చిత్రం తమిళనాడులో షూటింగ్ అంటే అభిమానులను అదుపు చేయడం కష్టమని భావించిన యూనిట్ ఈ చిత్రం షూటింగ్‌ను రాజమహేంద్రవరంలో జరుపుతోంది. అయితే ఆ ప్రాంతాలకు చెందిన తెలుగులోని సూర్య అభిమానులు ఏకంగా ఐదువేల మంది షూటింగ్ స్పాట్‌లోకి దూసుకువచ్చారు. దాంతో సెక్యూరిటీకి ఆ అభిమానులను కంట్రోల్ చేయడం కష్టసాధ్యంగా మారిందట. ఇదే విషయాన్ని దర్శకుడు సెల్వరాఘవన్ తెలుపుతూ తెలుగులో కూడా సూర్యకి ఉన్న ఫాలోయింగ్ చూసి తనకు ఆశ్చర్యం కలిగిందని తెలిపాడు.
సెల్వరాఘవన్‌కి తెలుగులో శ్రీరాఘవగా కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. '7జి బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' వంటి చిత్రాలు తెలుగు నాట ఘనవిజయం సాధించాయి. ఇక 'వర్ణ' చిత్రం మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. మరోవైపు సూర్య తదుపరి చిత్రంలో మోహన్‌బాబు విలన్‌గా నటిస్తున్నాడని సమాచారం. సాలాఖద్దూస్, తెలుగులో గురు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు సుధాకొంగర దర్శకత్వంలో సూర్య ఓ విభిన్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో విలన్ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండటంతో దానిని మోహన్‌బాబుని చేయమని స్వయంగా సూర్య కోరాడని, దానికి మోహన్‌బాబు కూడా ఓకే చెప్పాడని సమాచారం. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది.