హీరో జగపతిబాబుకి ‘లెజెండ్’ చిత్రం ఓ మేలిమలుపు. ఈ చిత్రంతో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన హవా మరలా మొదలైంది. ఈ చిత్రం గురించిన ఓ ఆసక్తికర అంశాన్ని తాజాగా జగపతిబాబు చెప్పుకొచ్చారు. ‘లెజెండ్’ సినిమాకి ముందు అవకాశాలు లేక ఇంట్లో ఉండేవాడిని. ఒకరోజు ఓ వ్యక్తి అటోలో దిగి మా ఇంటికి వచ్చాడు. ఒక సినిమాలో నటించమని నన్ను అడిగాడు. దర్శకుడు ఎవరు అని అడిగితే నేనేనని చెప్పాడు. నిర్మాత ఎవరంటే అది కూడా తానేనన్నాడు. హీరో కూడా తానేనని చెప్పాడు. మరి నేనేంటి? అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ సార్ అన్నాడు. ఆరోజున నా పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉంది.
అలాంటి సమయంలో నా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఫొటోలను బోయపాటి శ్రీను చూశాడు. విలన్‌గా చేస్తాడా? చేయడా? అన్నది బోయపాటి అనుమానం. అలా వారం పదిరోజులు గడిచిపోవడంతో నేనేంతో టెన్షన్ పడ్డాను. ఇంకా రారేంటి? అడ్వాన్స్ ఇవ్వరేంటి? అని ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత బోయపాటి వచ్చి నన్ను కలిశాడు. రెమ్యూనరేషన్ దగ్గర నేను ఒక ఫిగర్ అనుకున్నాను. వారు దానికంటే డబుల్ చెప్పడంతో ఎగిరి గంతేశాను. 30, 40 సంవత్సరాల కిందట నేను తమిళనాడులో ఓ చోట జాతకం చూపించుకున్నాను. హీరోగా చిత్ర పరిశ్రమలో ఒడిదుడుకులు ఎదుర్కొంటానని, ఆ తర్వాత 2018లో బిజీ అవుతానని వారు తాళపత్ర గ్రంధాలు చూసి చెప్పారు. వారు అప్పుడు ఏదైతే చెప్పారో అదే జరుగుతూ వచ్చింది.
ఇప్పుడు నేను హీరోను కాదు కాబట్టి నా మీద పెద్ద బాధ్యతలు లేవు. సినిమా బాగా ఆడుతుందా? ఓపెనింగ్స్ వస్తాయా? రావా? అనే టెన్షన్ కూడా నాకు లేదు. ఒకవేళ సినిమా ఆడకపోతే డబ్బులు తిరిగి ఇచ్చే పని కూడా ఉండదు. నేను హీరోగా చేస్తున్నప్పుడు షూటింగ్ ఆగిపోయినా, సినిమా ఆడకపోయినా నా రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేవాడిని. నా వల్ల నిర్మాతలు నష్టపోకూడదనే అలా చేసే వాడిని. కానీ ఇప్పుడు నాకు ఆ టెన్షన్ లేదు.. అంటూ చెప్పుకొచ్చారు.