స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడానికి, ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడంలో కీలకపాత్ర పోషించిన నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. తన తాతయ్య, ఎన్టీఆర్ తండ్రి కూడా మనవడు హరికృష్ణ డ్రైవింగ్ చేస్తుండగానే రోడ్డు దుర్ఘటనలో మరణించాడని అంటారు. ఆ తర్వాత కాలంలో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో నందమూరి హరికృష్ణనే చైతన్య రథాన్నివేలాది కిలోమీటర్లు నడిపాడు. ఆ తర్వాత ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో రవాణాశాఖా మంత్రిగా కూడా పనిచేశారు.
ఇక ఈయన ‘శ్రీకృష్ణావతారం, తల్లా పెళ్లామా, తాతమ్మకల, దానవీరశూరకర్ణ, శ్రీరాములయ్య, సీతయ్య, సీతారామరాజు, శ్రావణ మాసం, లాహిరి లాహిరి లాహిరిలో, టైగర్ హరిశ్చంద్రప్రసాద్’ వంటి పలు చిత్రాలలో నటించారు. స్వతహాగా ఈయన మంచి డ్రైవర్ కూడా. తనకి ఎంతో ఇష్టమైన కారు నెంబర్‌ని వినియోగిస్తూ ఉండేవారు. అదే సెంటిమెంట్‌తో ఆయన పిల్లలు కూడా, కుటుంబ సభ్యులు కూడా అదే నెంబర్‌ని వాడుతుండేవారు. ఇక ఈయనకు నలుగురు సంతానం. నందమూరి జానకీరాం, నందమూరి కళ్యాణ్‌రాం, జూనియర్ ఎన్టీఆర్‌లు ఈయన తనయులు, సుహాసిని అనే కుమార్తె కూడా ఆయనకు ఉంది. ఇక నందమూరి జానకీరాం కూడా నాలుగేళ్లకిందట రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. ఇక 2009లో జూనియర్ ఎన్టీఆర్ సైతం తీవ్ర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై బతికి బయటపడ్డారు. ఈ ప్రమాదాలన్నీ నల్గొండ జిల్లా విజయవాడ హైవేపైనే జరగడం గమనార్హం.
ఇక సెప్టెంబర్ 2వ తేదీన ఆయన 61వ ఏట నుంచి 62 ఏటకు ప్రవేశించనున్నాడు. తన జన్మదినానికి కేవలం కొద్దిరోజుల ముందే ఆయన ప్రమాదంలో మరణించడం పట్ల ప్రజలు తీవ్ర దిగ్బ్రాంతికి లోనవుతున్నారు. మరోవైపు ఆయన గతంలో అన్న తెలుగుదేశం అనే పార్టీని కూడా స్థాపించాడు. హిందుపురం నుంచి ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు. సమైక్యాంధ్రకోసం ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అతివేగం, సీటు బెల్ట్‌పెట్టుకోకపోవడమే ఈ దుర్ఘటనకు కారణంగా చెబుతున్నారు.