అటు ఫ్యామిలీ చిత్రాల హీరోగా, మరోవైపు మాస్ యాక్షన్ చిత్రాల కథానాయకునిగా గతంలో ఓ వెలుగు వెలిగిన జగపతిబాబు జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఈయన నటించిన చిత్రాలు ఎంతలా విజయం సాధించాయో.. మరి కొన్ని చిత్రాలు అంతలా నిరాశపరిచాయి. ముఖ్యంగా ఆయన తన సొంత బేనర్‌లో చేసిన ఏ చిత్రం కూడా సక్సెస్ కాలేదు. ఇక ఈయన నాటి అగ్రనిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడు అన్న విషయం తెలిసిందే. వారి ఇంట్లోని పెద్దలకి ఆయన సినిమాలలోకి వెళ్లడం ఇష్టంలేకపోయినా తల్లిదండ్రులు పెట్టిన కొన్ని నిబంధనలకు లోబడి ఆయన హీరోగా మారాడు.
ఇక ఈయన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్ననేపధ్యం, ఎస్వీకృష్ణారెడ్డి, కృష్ణవంశీ వంటి వారు ఫేడవుట్ కావడం, ఈవీవీ సత్యనారాయణ వంటి దర్శకులు మరణించడం ఆయన కెరీర్‌ని పెద్ద అగాధంలో పడేసింది. ఇలా ఇన్నింగ్స్ చివరలో ఎన్నో అపజయాలను ఎదుర్కొన్న ఆయన 'లెజెండ్' చిత్రం పుణ్యమా అని సౌతిండియాలోనే టాప్ విలన్స్‌లో, క్యారెక్టర్ , సపోర్టింగ్ యాక్టర్‌గా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో 13కి పైగా భారీ చిత్రాలు ఉన్నాయంటే అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఇలాంటి ఎన్నో ఒడిదుడుకులు ఉన్న జగపతిబాబు జీవిత చరిత్రను బయోపిక్‌గా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బయోపిక్‌ని సినిమాగా కాకుండా సీరియల్‌గా తెరకెక్కిస్తూ ఉండటం విశేషం. ఈ బయోపిక్‌ని 20ఎపిసోడ్లుగా చిత్రీకరించనున్నారు. ఈ సీరియల్ షూటింగ్ ఆల్‌రెడీ ప్రారంభం అయిందని, దీనికి 'సముద్రం' అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారట. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుందని తెలుస్తోంది.