రామ్ చరణ్ రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాక ఇప్పుడు బోయపాటితో కలసి ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ కి శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న బోయపాటి - చరణ్ సినిమాలో ఎక్కువగా యాక్షన్ పాళ్లే ఉంటాయనే టాక్ సోషల్ మీడియాలో జోరుగా వినబడుతుండగా.. కాదు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని.. సినిమాలో కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ అన్ని సమానంగా వుండబోతున్నాయనే న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో భారీతనంతో నిర్మిస్తున్నాడు. అయితే ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే తాజా షెడ్యూల్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ వినని ఒక దేశం వెళ్ళబోతున్నారు.
అజర్ బైజాన్ అనే దేశంలో చరణ్ - బోయపాటి తమ చిత్రంలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. అజర్ బైజాన్ దేశం గురించి బోయపాటి సన్నిహితుల ద్వారా తెలుసుకుని.. అక్కడ లొకేషన్స్ ని చూసేసి వచ్చి అక్కడ చరణ్ సినిమా యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించాలని బోయపాటి డిసైడ్ అయ్యాడట. ఇక చరణ్ కూడా బోయపాటి చూపించిన లొకేషన్స్ కి కనెక్ట్ అవడమే కాదు.. షూటింగ్ అక్కడే చేద్దామని చెప్పడంతో.. త్వరలోనే RC 12 టీమ్ మొత్తం అజర్ బైజాన్ దేశ ఫ్లైట్ ఎక్కబోతుందట. ఇక అక్కడ ఎక్కువగా యాక్షన్ అంటే.. దాదాపుగా ఐదారు యాక్షన్ సీక్వెన్సెస్ ని తెరకెక్కిస్తారట. ఐదారు యాక్షన్ సీక్వెన్సెస్ అంటే సినిమాలో ఎక్కువ పార్ట్ యాక్షన్ సీన్స్ ఉంటాయని డిసైడ్ అవ్వొచ్చన్నమాట.
ప్రస్తుతం సై రా నిర్మాణంలో కాస్త బిజీగా వున్న రామ్ చరణ్ ఇక బోయపాటి సినిమా షూటింగ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న బోయపాటి - చరణ్ సినిమా తాజా షెడ్యూల్ లో చాలావరకు షూటింగ్ కంప్లీట్ అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తున్న ఈ సినిమా జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది.