రాఖీపౌర్ణమి సందర్భంగా జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ అందరు మహిళలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. సోదర ప్రేమకు, మానవ సంబంధాల పరిపుష్టతకు రక్షాబంధన్ ప్రతీక అని, మన చేతికి రాఖీ కట్టినా కట్టలేకపోయినా కూడా అందరు ఆడవారిని మన ఆడపడుచులుగా గౌరవించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఆడబిడ్డని మన ఆడపడుచుగానే చూడాలని, అక్కాచెల్లెళ్ల గౌరవ మర్యాదలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. అనురాగం, ఆప్యాయత, అనుబంధాలకు ప్రతీక ఈ రాఖీ వేడుకని ఆయన తెలిపారు. అక్కాచెల్లెళ్ల గౌరవ మర్యాదలు కాపాడి వారికి జీవితాంతం సోదర ప్రేమను పంచుదామని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
ఇక వామపక్షాలైన సీపీఐ, సీపీఎం పార్టీలు సెప్టెంబర్ 15న విజయవాడలో చేపట్టదలచిన మహాగర్జన సభకు జనసేన మద్దతు కావాలని పవన్‌ని కోరాయి. పవన్‌కళ్యాణ్ కూడా తాము చేపట్టే మహాగర్జనకు హాజరై, తమ సభకు మద్దతు పలకాలని వారు జనసేనానిని కోరారు. మరోవైపు అధికార దాహంతో, అవినీతి సొమ్ముతో కొందరు తెలుగుదేశం పార్టీని ఓడించి, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని భావిస్తుంటే, కొందరు మాత్రం రాజకీయ అజ్ఞానంతో తనను టార్గెట్ చేస్తున్నారని చంద్రబాబు ఇన్‌డైరెక్ట్‌గా జగన్, పవన్‌లపై నిప్పులు చెరిగారు. తనపై కుట్రలతో కొత్త పార్టీలను, చిన్నపార్టీలను నెలకొల్పుతూ కుట్రల ద్వారా టిడిపిని ఓడించాలని కొందరు భావిస్తున్నారని, కానీ కుట్రల ద్వారా టిడిపిని ఓడించడం వీలుకాదని ఆయన పేర్కొన్నారు.
నిన్నటి వరకు పవన్‌కి తాను బాగానే కనిపించానని, ఇప్పుడు ఆయన కూడా తనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు సెటైర్లు వేశాడు. నిపుణుల కమిటీ పెట్టి కేంద్రం ఏపీకి రూ.75వేల కోట్లు ఇవ్వాలని తేల్చిన ఈ పెద్దలు దాని గురించి మాత్రం మాట్లాడరని మండిపడ్డారు. మోదీతో లాలూచీపడిన వైకాపా, జనసేనలకు బుద్ది చెప్పాలన్నారు. ఒకవైపు పవన్ మోదీకి తొత్తుగా చంద్రబాబు అభివర్ణిస్తుంటే, బిజెపి అంటేనే మండిపడే వామపక్షాలు మాత్రం పవన్ సాయం కోరడం చూస్తే ఇది ఓ చిత్రంగా కనిపిస్తోందని చెప్పవచ్చు.