అందానికి అందం, నటనాభినయానికి నటనాభినయం వంటి పలు టాలెంట్లు ఉన్న నటిగా కీర్తిసురేష్‌కి మంచి పేరుంది. అంతెందుకు రెండు మూడు చిత్రాలకే ఆమె తన మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగులో సొంతగా డబ్బింగ్ చెబుతోందంటే ఆమె టాలెంట్‌కి ముచ్చటేస్తుంది. ముఖ్యంగా ఇటీవల వచ్చిన ‘మహానటి’లో సావిత్రి పాత్రకు ఆమె జీవం పోసిందనే చెప్పాలి. ఇంతలా టాలెంట్ కలిగిన ఏకసంతాగ్రహి ఆమె.
ఇక ఈమె త్వరలో తమిళనాట అందాల నటీమణిగా, అద్భుతమైన, ధైర్యవంతురాలైన రాజకీయనాయకులిగా, పురచ్చితలైవిగా పేరు తెచ్చుకుని మరణించిన అమ్మ జయలలిత పాత్రను చేయనుందని పలు వార్తలు వస్తున్నాయి. ఆల్‌రెడీ ఓ నిర్మాత, దర్శకుడు అమ్మ పాత్రలో ఆమె నటింపజేయడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చారని వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనిపై తాజాగా కీర్తిసురేష్ స్వయంగా స్పందించింది.
ఇప్పటివరకు ఆ పాత్ర కోసం నన్నెవ్వరూ సంప్రదించలేదు. జయలలిత గారు గొప్పనటి. అంతకు మించి గొప్పనాయకురాలు. అలాంటి జయలలిత పాత్రలో నటించడం అంత సులభం కాదు. అది అంత తేలికైన విషయం కూడా కాదు. నాకు అంత ధైర్యం కూడా లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కేరళ వరదల్లో ఇబ్బందులు పడుతున్న కేరళీయులకు సహాయం చేసే పనిలో తలమునకలై ఉన్నానని, నిరాశ్రయులైన వారిని చూసినప్పుడు ఎంతో బాధగా ఉంటోందని ఆమె చెప్పుకొచ్చింది. మరోవైపు జయలలిత జీవిత కథను తెరకెక్కించడానికి ముగ్గురు నలుగురు నిర్మాతలు, దర్శకులు రెడీగా ఉన్నట్లు కోలీవుడ్ మీడియా కోడైకూస్తోంది.