ఇంతకాలం విదేశాలకు, బాలీవుడ్‌కే పరిమితమైన నాన్సెస్ షోలు రియాల్టీ షోల పేరుతో మన దక్షిణాదిన కూడా బాగా వస్తున్నాయి. ఏకంగా టీఆర్పీల కోసం ఓ షోకు ప్రోమోగా తమిళ హీరో ఆర్య వంటి వ్యక్తి నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది.. అమ్మాయిలు తమ బయోడేటా పంపాలని చీఫ్ పబ్లిసిటీ చేశాడంటే మన బుల్లితెరపై షోలు పోతున్న పోకడ అర్దం అవుతుంది. అలాంటి వాటిల్లో ఒకటే బిగ్ బాస్ కూడా. ఈ షో మొదలైనప్పుడు తమిళ సంఘాల నుంచి సంఘసంస్కర్తల వరకు విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమైంది. తెలుగు, తమిళంలో ఈ షో పెద్ద హిట్ అయినా కూడా వివాదాలు మాత్రం సమసి పోవడం లేదు.
తాజాగా నాని హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ సీజన్2కి కూడా ఇవే సమస్యలు ఎదురవుతున్నాయి. నాన్సెస్‌నంతా ఇందులో చూపిస్తున్నారని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ మానవహక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేశాడు. ఇందులో షో పేరుతో 16మందిని ఒకే ఇంటిలో నిర్బందించి, వెకిలివేషాలు చేస్తున్నారనని, దీనివల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆరోపించాడు. ఈ షో ద్వారా మహిళలను కించపరుస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో తెలిపాడు. ఈ షో వల్ల సమాజానికి ఇసుమంతైనా ఉపయోగం లేదని, వెకిలిచేష్టలు మాత్రమే చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం లాభాపేక్షతో వ్యాపారసంస్థలతో కుమ్మక్కై యాజమాన్యాలు ఇలాంటి షోలు ప్రచారం చేస్తున్నారు. కేవలం టిఆర్పీలను పెంచుకోవడానికే ఈ షో నడుపుతున్నారు. షోలో ఎక్కడి నుంచో వినిపించే బిగ్‌బాస్ తన చిత్ర విచిత్రమైన ఆదేశాలతో పోటీదారులను హింసిస్తున్నారు. బాత్రూమ్‌లు కడగాలని, లేదా మరో విధమైన పిచ్చిటాస్క్‌లతో పోటీదారులను బానిసల్లా చూస్తున్నారు. ఇది పూర్తిగా చట్టవిరుద్దం. షోలో పాల్గొంటున్న వారిని బయటికి రానివ్వకుండా బంధించి ఉండటం మానవహక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది.
దీనివల్ల చెడు సంకేతాలు వెళ్తున్నాయి. ఈ షో చూస్తున్న వారు మానసిక ఒత్తిడికి, భావోద్వేగాలకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి తక్షణం ఈ షోని ఆపివేయాలని ఆయన కోరారు. అయినా జనాలు చూసినంత కాలం వీటిని ఆపడం ఎవరి వల్ల కాదు. ప్రేక్షకుల్లో మార్పు రానిదే ఎవ్వరూ ఏమి చేయలేరని చెప్పవచ్చు.