అద్భుతమైన కళాఖండాలను ఆయన తీర్చిదిద్దారు. కళలకు, సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు తెలియజేయడంలో అద్భుతమైన విజయం సాధంచారు. సంగీతం, నృత్యం, సామాజిక అంశాలే ఆయన కధా వస్తువులు. అనాదిగా వస్తున్న సంప్రదాయాల గొప్పతనాన్ని తన చిత్రాల ద్వారా తెలియజేశారు. కళ్లతోనే కోటి భావాలు పలికించేలా నటీనటుల నుంచి నటనను రాబట్టి ప్రేక్షకుల మనస్సులో తన సినిమాలను వాటి పాత్రలను చరిత్ర ఉన్నంతకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేలా చేయగలిగిన కళాతపస్విగా మారారు. ఆయనతో కలిసి ముచ్చటించే అవకాశాన్ని స్పిక్‌మేకే సంస్థ ఐఐటీయన్లకు కల్పించింది.
ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, సినిమాలలోని సన్నివేశాలను ఎప్పటికప్పుడు మెరుగ్గా తీయడానికి ప్రయత్నించేవాడిని. కథ రాసుకున్న తర్వాత ఎన్నో మార్పులు చేసేవాడిని. స్వాతిముత్యం చిత్రంలో కమల్‌హాసన్ రాధికను వివాహం చేసుకున్న తర్వాత తన ఆస్థి ఇవ్వాలని వీరభద్రరావుని అడుగుతాడు. అందుకు ఆగ్రహించి వీరభద్రరావు కమల్‌హాసన్‌ని తిడతాడు. మొదట ఈ సన్నివేశంలో రాధిక చేత చాంతాడంత డైలాగ్ చెప్పించాలని భావించాం. కానీ చివరకు ఒక్క మాట లేకుండానే వీరభద్రరావుని కొట్టమని రాధిక కమల్‌కి కర్రని ఇవ్వడంగా తీశాం. ఇంతకంటే ఈ సన్నివేశంలో డైలాగ్స్‌కి పనిలేదు కదా. నా సినిమాలు 'స' అనే అక్షరంతో మొదలయ్యేలా పెట్టడం వెనక ఎలాంటి కారణం లేదు. సినిమా రంగంలో చాలా సెంటిమెంట్లు ఉంటాయి. రాకేష్ రోషన్ చిత్రాలన్నీ 'క' అనే అక్షరంతో మొదలవుతాయి. మరికొందరివి 'అ' అనే అక్షరంతో ఉంటాయి. అంతే.. అంతకు మించిన కారణం లేదు.
నేను ఏరోజు నిర్మాతలను ఒప్పించడానికి ప్రయత్నించలేదు. కథ చెప్పి, సమయం ఇచ్చేవాడిని. ఒప్పుకుంటే సినిమా తీసేవాడిని. వాణిజ్యపరంగా కూడా చిత్రాలు విజయం సాధిస్తాయని ముందే చెప్పలేం. కథ విన్నప్పుడు కూడా అలా వినిపించకపోవచ్చు. నా సినిమాలు సామాజిక అంశాలను స్పృశిస్తూనే నిర్మాతలకూ లాభాలు తెచ్చిపెట్టాయి. స్వర్ణకమలం చిత్రానికి అదే టైటిల్ ఎందుకు పెట్టానంటే.. మన ప్రాచీన కళలన్నీ స్వర్ణకమలాలే. అందుకే ఆ పేరు పెట్టా. ఎలాగూ 'స' అనే అక్షరంతోనే ప్రారంభం అవుతుంది కదా..!
నేను ఏదో మార్చాలని, ఇంకేదో ఉద్దేశ్యంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టలేదు. మీరు ఎలాగైతే ఇంజనీర్లుగా మారాలని అనుకున్నారో నేను కూడా అలాగే సినిమా రంగంలోకి ప్రవేశించాను. నేను మన సమాజాన్ని, చుట్టూ ఉన్న మనషులను ఎంతో ఇష్టపడతాను. అందుకే నా చిత్రాన్ని మన చుట్టూ జరిగే సంఘటనల్లాగే ఉంటాయి. నా పాత్రలన్నీ మీ మద్యనే తిరుగుతాయి. ప్రతి ఒక్కరు మంచి వారుగానే ఉంటారు. పరిస్థితుల వల్ల ఒక్కోసారి ఒక్కోలా మారుతూ ఉంటారు. అందుకే నా చిత్రాలలో బుర్రమీసాలు పెంచుకుని అడ్డలుంగీలు కట్టుకునే విలన్లు కనిపించరు. కాలమే నా సినిమాలలో విలన్.. అని చెప్పుకొచ్చారు.