నేటిరోజుల్లో సోషల్‌మీడియా సినిమా ప్రమోషన్స్, సాధించే విజయాల విషయంలో కీలకపాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం టీజర్, ఫస్ట్‌లుక్ వంటి వాటికి సామాజిక మాద్యమాలలో వచ్చే రెస్సాన్స్‌ని బట్టి ఆయా సినిమాలపై ఎన్ని అంచనాలు ఉన్నాయి అనేది అర్ధం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇది మంచికా? చెడుగా? అనేది పక్కనపెడితే ఈ వ్యూస్ విషయంలో కూడా పలు అడ్డదారులు కొత్త పుంతలు తొక్కుతున్నాయనే విమర్శ కూడా లేకపోలేదు. ఇక విషయానికి వస్తే 'బాహుబలి' తర్వాత తెలుగులో రూపొందుతున్న ఆ స్థాయి భారీ చిత్రంగా మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ 'సై..రా..నరసింహారెడ్డి'ని చెప్పుకోవచ్చు. నటీనటుల విషయంలో 'బాహుబలి' కంటే అమితాబ్, విజయ్‌సేతుపతి, కిచ్చా సుదీప్, నయనతారల వల్ల 'సైరా' ఓ అడుగు ముందే ఉంది. బడ్జెట్ పరంగా కూడా ఇది 'బాహుబలి' స్థాయి చిత్రమే అనిఅంటున్నారు.
కానీ తేడా ఒక్కటే. రాజమౌళి స్థాయిని సురేందర్‌రెడ్డి అందుకోగలడా? లేదా? అన్నదే కీలకపాయింట్. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌గా రూపొందుతున్న ఈచిత్రం టీజర్ మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా విడుదలై సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతోంది. టీజర్‌కి సూపర్‌రెస్పాన్స్ రావడంతో ఇదిసోషల్‌మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. వ్యూస్ విషయంలో ఈ చిత్రం టీజర్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అన్ని డిజిటల్ ఫార్మాట్స్‌లో కలిపి ఈ టీజర్ 24గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా చిత్ర యూనిటే ప్రకటించింది. మన లెక్కలో ఈ చిత్రం సాధించిన వ్యూస్ కోటి ఇరవై లక్షలుగా చెప్పాలి. ఇప్పటికీ ఇదే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో టాప్ అని చెబుతున్నారు. కాగా ఈ 'సై..రా..నరసింహారెడ్డి' చిత్రం 2019 వేసవిలో విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మెగాస్టార్‌కే కాదు.. చిత్ర నిర్మాతగా రామ్‌చరణ్‌కి కూడా ఇది ప్రెస్టీజియస్ చిత్రం కావడం గమనార్హం.