తెలుగు తెరకు మరోస్టార్ లభించాడు. 'గీతగోవిందం'తో విజయ్‌దేవరకొండ పెద్ద స్టార్స్ జాబితాలో చేరిపోయాడని చిరు కితాబునిచ్చాడు. ఇక అల్లుఅరవిండ్ అయితే విజయ్‌దేవరకొండ ఇండస్ట్రీలో 100 సినిమాలలో హీరోగా నటించడం ఖాయమని, ఆయన చాలా ముదురని, మహా తెలివైన వాడని సర్టిఫికేట్ ఇచ్చాడు. ఇక నాని, నిఖిల్, శర్వానంద్ వంటి వారికి సైతం పోటీనిస్తూ తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు సాధించడం ఖాయమనే నమ్మకాన్ని నిర్మాతల్లో విజయ్ కల్పిస్తున్నాడు.
నిజానికి వారం ముగియకుండానే ఈ చిత్రం ఏకంగా 50కోట్ల క్లబ్‌లో చేరుతుందని విడుదలకు ముందు ఎవ్వరూ ఊహించలేదు. కొందరైతే 'అర్జున్‌రెడ్డి'తో విజయ్ ఒన్ మూవీ వండర్‌గా మిగులుతాడని అన్నారు. వారి అంచనాలన్నింటిని విజయ్ తిప్పికొడుతున్నాడు. ఈ నెలాఖరు వరకు బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికర చిత్రం లేదు. దీనిని విజయ్ ఎలా సద్వినియోగం చేసుకోనున్నాడు? అనేది అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. అక్షయ్‌కుమార్ 'గోల్డ్'ని కూడా ఈ చిత్రం కలెక్షన్లలో అదిగమిస్తోందంటే అది చిన్న విషయం కాదు. ఇక ఈ చిత్రం 100కోట్ల క్లబ్‌లో చేరాలంటే మరో 45కోట్లు దాకా రాబట్టాల్సివుంది. సరైన పోటీ చిత్రాలు రెండు వారాల వరకు లేకపోవడం దీనికి కలిసొచ్చే అంశమే.
ఇప్పటికీ ఈ చిత్రం ఓవర్‌సీస్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో, తెలుగువారు ఉన్న ప్రతిచోటా హౌస్‌ఫుల్స్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రం అన్ని కలిసి వస్తే 100కోట్ల క్లబ్‌లో చేరడం కూడా అసాధ్యమేమీ కాదని అంటున్నారు. అయినా విజయ్ ఈ చిత్రంతో 100కోట్ల ఫీట్ అందుకోలేకపోయినా కూడా భవిష్యత్తులో మాత్రం 100కోట్లు కొల్లగొట్టగల సత్తా, ఇమేజ్‌లను ఈ యువ సంచలనం సాధించాడని ఒప్పుకోవాల్సిన విషయమే మరి.