హాలీవుడ్‌లో పెళ్లికాని యువతుల కంటే పెళ్లయిన హీరోయిన్లకే ఎక్కువ క్రేజ్ ఉంటుందని ఆమధ్య జరిగిన ఓ సర్వేలో తేలింది. ఇక బాలీవుడ్‌లో కూడా చాలా కాలంగా పెళ్లయిన హీరోయిన్లు కూడా కొత్తతరం స్టార్‌హీరోయిన్స్‌కి అన్ని విషయాలలో పోటీని విసురుతున్నారు. ఇక దక్షిణాదిలో కూడా జ్యోతిక, అమలాపాల్, సమంత, అనసూయ వంటి వారు ఇదే నిరూపిస్తూ ప్రేక్షకులు పెళ్లయినా కాకపోయినా కూడా తమ అందం, టాలెంట్‌తో మెప్పిస్తే ఆదిరించడానికి మేము రెడీ అనే సంకేతాలు ఇస్తూ ఉన్నారు.
ఇక విషయానికివస్తే నిన్నటి తరంలో స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన సుందరి సిమ్రాన్. ఈమె చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ స్టార్స్‌తో పాటు మహేష్‌బాబు వంటి యంగ్ స్టార్స్ సరసన కూడా నటించి మెప్పించింది. తెలుగులో కోటిరూపాయల పారితోషికం తీసుకున్న మొదటి హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కింది. పెళ్లయిన తర్వాత కొంతకాలం తెరమరుగైన ఈమె మరలా నటిగా తన కెరీర్‌ని కొనసాగిస్తోంది. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆమె కార్తీక్‌సుబ్బరాజ్ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న రజనీకాంత్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీనితో పాటు మరో రెండు మూడు తమిళ చిత్రాలలో కీలక పాత్రలను పోషిస్తోంది.
ఇక ఈమె తాజాగా మాట్లాడుతూ, నేను అమ్మ పాత్రలను చేయాలని అనుకోవడం లేదు. పెళ్లయితే అమ్మ పాత్రలే ఇస్తారా? అని అసహనం వ్యక్తం చేసింది. ఐశ్వర్యారాయ్, కరీనాకపూర్ వంటి వారు పెళ్లయిన తర్వాత కూడా అద్భుతమైన పాత్రలు చేస్తూ ఉన్నారని, పెళ్లయిన తర్వాత జ్యోతిక కూడా మంచి పాత్రలను చేస్తోందని వ్యాఖ్యానించింది. పెళ్లయిన హీరోయిన్ల విషయంలో దర్శకనిర్మాతలు మైండ్‌సెట్ మారాలని సూచించింది. అయినా సినిమా అనేది వ్యాపారం. ప్రేక్షకులు ఎవరిని ఆదరిస్తూ ఉంటే వారినే దర్శక నిర్మాతలు, హీరోలు తీసుకోవాలని భావిస్తారు తప్పితే కోట్లాది రూపాయల బడ్జెట్‌తో చేసే వ్యాపారంలో వారు ఎవరో వేరే వారి ఇష్టం ప్రకారం సినిమాలలో అవకాశాలు ఇస్తారని భావించడం, వారి నుంచి అలా ఆశించడం కూడా తప్పేనని చెప్పాలి....!