యంగ్ టాలెంటెడ్ వ్యక్తులను తన అసిస్టెంట్స్‌గా పెట్టుకుని వారిని ఒక జట్టుగా చేసి తన చిత్రాల కథలు, సంభాషణలు, ఇతర దర్శకత్వ వ్యవహారాలలో వారి నుంచి మంచి అవుట్ పుట్ సాధించే దర్శకుల్లో ఒకరు పూరీ జగన్నాథ్. కానీ ఆయన వద్ద పనిచేసిన పలువురు అసిస్టెంట్స్ స్వయంగా దర్శకులు కావడంతో ఆ ఎఫెక్ట్ పూరీ చిత్రాలపై కూడా పడుతోంది. ఇక విషయానికి వస్తే తాజాగా 'గీతగోవిందం'తో సంచలనం సృష్టిస్తున్న దర్శకుడు పరశురాం కూడా పూరీ శిష్యుడే.
ఈయన తాజాగా మాట్లాడుతూ, నేను నలుగురు దర్శకుల వద్ద పని చేశాను. పూరీజగన్నాధ్, దశరథ్, వీరుపోట్ల, బొమ్మరిల్లు భాస్కర్‌ల వద్ద పనిచేశాను. వారు నలుగురు ఎంతో ప్రతిభావంతులు. రచయితలుగా, దర్శకులుగా మంచి టాలెంట్ ఉండే వారు. ముఖ్యంగా నేను పూరీ జగన్నాథ్‌ని చూసి డైరెక్టర్‌గా మారాలని భావించాను. పూరీ నా కళ్లముందు తిరుగుతూ స్టార్ డైరెక్టర్‌గా మారడం నాకు స్ఫూర్తిగా నిలిచింది. ఏదైనా చేయాలంటే దానిని ఖచ్చితంగా చేయాలనే పట్టుదల పూరీని చూసే నేర్చుకున్నాను.
ఇక రచయితగా నాకు వీరుపోట్ల మంచి విద్యను నేర్పారు. రచయితగా వీరుపోట్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి అనే విషయం ఆయన దగ్గరే నేర్చుకున్నాను... అంటూ పలు విషయాలను చెప్పుకొచ్చాడు. మొత్తానికి 'గీతగోవిందం'తో పరశురాం కూడా స్టార్ డైరెక్టర్‌గా మారాడనే చెప్పాలి.