ఈతరం దర్శకుల్లో చిరంజీవిని డైరెక్ట్ చేసే చాన్స్ అతి కొద్ది మందికే వచ్చింది. అందులో వి.వి.వినాయక్‌కి రెండు సార్లు ఈ అదృష్టం తలుపు తడితే తాజాగా చిరంజీవి ప్రతిష్టాత్మకంగా, డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' బయోపిక్‌కి సురేందర్‌రెడ్ది దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తాలూకు టీజర్ తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజున విడుదలైంది.
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న చిరంజీవి తనయుడు, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, 'పరుచూరి బ్రదర్స్‌ఈ చిత్రం నాన్న గారితో చేయాలని ఎంతో కాలంగా ఉత్సాహం చూపిస్తున్నారు. 12ఏళ్ల తర్వాత వారి తపన ఇంతకాలానికి ఫలించింది. దర్శకుడు సురేందర్‌రెడ్డితో నాకు ధృవ చిత్రం నుంచి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. సురేందర్‌రెడ్డి వేరే కథల కోసం వెతుకుతున్నప్పుడు పరుచూరి బ్రదర్స్ వద్ద 'సై...రా' కథ ఉందని చెప్పి ఆయన్ను పరుచూరి వారి వద్దకు పంపించాను. ఆ కథను నాన్నతో చేస్తే బాగుంటుందని అన్నాను. నేను అడిగాను కదా..! అని వెంటనే సురేందర్‌రెడ్డి ఒప్పుకోలేదు. చిరంజీవి గారితో చిత్రం అంటే అది పెద్ద బాధ్యత. అందువలన ఆయన కొంత సమయం తీసుకున్నారు. కథను పూర్తిగా పరిశీలించిన తర్వాత దానిపై పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత నాన్నగారిని కలిసి సింగిల్ సిట్టింగ్‌లో నాన్నగారిని ఒప్పించాడు' అని రామ్‌చరణ్ చెప్పుకొచ్చాడు.
ఇక సురేందర్‌రెడ్డి కళ్యాణ్‌రామ్ చిత్రం 'అతనొక్కడే' ద్వారా ఇండస్ట్రీకి దర్శకునిగా పరిచయం అయ్యాడు. ఎన్టీఆర్‌తో 'ఊసరవెల్లి', రవితేజతో 'కిక్', రామ్‌చరణ్‌తో 'ధృవ', అల్లుఅర్జున్‌తో 'రేసుగుర్రం' వంటి చిత్రాలను ఆయన తెరకెక్కించాడు. ఇలా చిరు ప్రతిష్టాత్మక చిత్రం ద్వారా ఈయన దర్శకునిగా మరో మెట్టు ఎక్కుతున్నాడని చెప్పవచ్చు.