చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం 'సై రా నరసింహారెడ్డి'. చిరు కొడుకు, స్టార్ హీరో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. అయితే నిన్న మంగళవారం సై రా సినిమా టీజర్ ని చిరు తల్లి అంజనాదేవి, భార్య సురేఖ చేతుల మీదుగా రామ్ చరణ్, సురేందర్ రెడ్డిలు విడుదల చేసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే మీడియా మిత్రులు సై రా నరసింహారెడ్డి బడ్జెట్ గురించి రామ్ చరణ్ ని పదే పదే అడిగినప్పటికీ... నాన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ఖర్చుకి వెనుకా ముందూ చూడట్లేదు. భారీ బడ్జెట్ తో తీస్తున్నాం. లాభాలు వస్తే బోనస్. రాకున్నా ఆనందమే.. ఇలాంటి చారిత్రాత్మక సినిమాని నిర్మించామని సంతోష పడతాం అంటూ.. సై రా బడ్జెట్ గురించి క్లారిటీ ఇవ్వకుండా దాచేశాడు.
మరి అదే రోజు రాత్రి సై రా బడ్జెట్ ఎంతుంటుందనేది మెగా హీరో అల్లు అర్జున్ అస్పష్టమైన క్లారిటీ ఇచ్చేశాడు. గత రాత్రి శిల్పకళా వేదికలో చిరు బర్త్ డే వేడుకలు అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అరవింద్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకి హాజరైన అల్లు అర్జున్ రామ్ చరణ్ దాచిపెట్టిన సై రా బడ్జెట్ గురించి రివీల్ చేసేశాడు. చిరు కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. అత్యధిక బడ్జెట్లో సై రా నరసింహారెడ్డి తెరకెక్కుతోందని... చిరు రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150కి ఎంత వసూళ్లు వచ్చాయో దానికి రెట్టింపు మొత్తం ఈ సినిమాపై నిర్మాత రామ్ చరణ్ ఖర్చు పెడుతున్నాడని అల్లు అర్జున్ సై రా సినిమా బడ్జెట్ పై నెలకొన్న సందిగ్దతకు క్లారిటీ ఇచ్చాడు. మరి చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమా దాదాపుగా 100 కోట్ల షేర్ ని కొల్లగొట్టింది.
మరి దీన్నిబట్టి అల్లు అర్జున్ చెప్పిన సై రా బడ్జెట్ ని అంచనా వెయ్యొచ్చు. బన్నీ చెప్పిన దాన్ని బట్టి సై రా సినిమాకి రామ్ చరణ్ అటు ఇటుగా 200 కోట్ల బడ్జెట్ పెడుతున్నదనిపిస్తుంది. మరి సై రా సినిమా బడ్జెట్ ని తెలివిగా రామ్ చరణ్ దాచేస్తే... అల్లు అర్జున్ మాత్రం రివీల్ చేసి పారేసాడు. ఇకపోతే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియా వైడ్ గా పలు భాషల్లో విడుదలకాబోతుంది. భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాలో పలు భాషా నటీనటులు నటిస్తున్నారు.