మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన బర్త్‌డే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మేము చిన్నప్పుడు నివసించిన ఇంటి వద్ద ప్రహరీ గోడ వెడల్పుగా ఉండేది. దాంతో దాని మీదకి ఎక్కి పలు విన్యాసాలు చేసేవాడిని. విన్యాసాలు చేస్తూ ఆ ప్రహరీ గోడ మీద పరుగెడుతూ ఉండేవాడిని. ఒకసారి మా నాన్న చూసి టెన్షన్ పడిపోయి నన్ను ఇంట్లోకి తీసుకొచ్చి నీవేం చేస్తున్నావు అంటూ అమ్మను అరిచాడు. నాకు బడిత పూజ జరిగింది. అప్పుడు అమ్మ ఒరేయ్ వెళ్లకురా..నిన్ను ఇలా మంచానికి కట్టేయలేను. నీ హుషార్‌ని ఆపలేను అని అంది. ఆ తర్వాత అవే విన్యాసాలు నాకు లక్షలాది మంది అభిమానులను తెచ్చిపెట్టాయి. 'దొంగ' చిత్రం సందర్భంగా ఓ సీన్‌లో పదంతస్తుల మేడ మీద ఇలాంటి విన్యాసాలే చేశాను. ప్రహరీ మీద రోల్ అవుతూ సీన్ చేయాలి. అది నాగబాబు చూశాడు. ఇంటికి వెళ్లి అన్నయ్య అంత రిస్క్ చేస్తున్నాడు అంటూ ఏడ్చేశాడట. చిన్నప్పుడు ప్రహరీ గోడ మీద విన్యాసాలు చేస్తే తన్నులు పడ్డాయి. సినిమా స్క్రీన్ మీద చేస్తుంటే అభిమానుల ప్రేమజల్లులు పడుతున్నాయి.
'గూండా' చిత్రంలో కదులుతున్న రైలు కింద రాడ్డు పట్టుకుని వెళ్లే సీన్. రైళ్ల పట్టాల మీద ఉన్న రాళ్లు వీపుకి గుచ్చుకుంటూ ఉన్నాయి. ఆ షూటింగ్‌కి నాన్నగారు వచ్చారు. ప్రొడ్యూసర్‌ని పిలిచి కేకలేశారు. ప్రాణాలతో చెలగాటం ఎందుకు అని అన్నారు. ఆ నిర్మాత నువ్వు చేయవద్దు బాబు.. మీ నాన్న మమ్మల్ని తిడుతున్నాడు అని అన్నాడు. నాన్నా నువ్వు ఇంటికి వెళ్లిపో... నేను షూటింగ్ పూర్తి చేసివస్తానని చెప్పి పంపించే వాడిని. చిన్నప్పటి అల్లరే నేడు సినిమాలలో పేరు తీసుకుని వస్తోంది. 'ఘరానా మొగుడు' చిత్రంలో అమ్మకి సేవ చేసేటప్పుడు నాకు మా అమ్మే గుర్తుకు వచ్చింది. మా అబ్బాయికి ఎవ్వరూ పోటీ కాదు. వాడికి వాడే పోటీ అని మా అమ్మ అంటుంది. మెగా హీరోలలో అందరు డ్యాన్స్ బాగా చేసేవారే ఉన్నా కూడా మా వాడిని మించిన డాన్సర్ లేడంటుంది. అత్తాకోడళ్ల విషయంలో ఒకే గొడవ జరుగుతుంది. మా అబ్బాయి గొప్ప అంటే కాదు.. మా అబ్బాయి గొప్ప అని వాదించుకుంటారు. 'ఖైదీనెంబర్ 150' విడుదలై 100కోట్ల క్లబ్‌లో చేరితే మా అమ్మ నాకొడుకు గొప్ప అంది. రంగస్థలం తర్వాత నా శ్రీమతి చరణ్ గొప్ప అంది. అప్పుడు మా అమ్మ సైరా వస్తుంది చూడు అంటుంది అని చెప్పుకొచ్చాడు.