విజయాలు వచ్చినప్పుడు అందరు నువ్వు సూపర్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తారు. అదే వ్యక్తి ఫ్లాప్‌లో ఉంటే అలా పొగిడిన భజనపరులే తీవ్రంగా విమర్శిస్తూ నోటికొచ్చింది మాట్లాడుతూ, మనసులను గాయపరుస్తారు. కానీ కష్టాలలో కూడా తోడు ఉండే వారే నిజమైన శ్రేయోభిలాషులు. ఈ విషయం ‘గీతాగోవిందం’తో స్టార్ డైరెక్టర్‌గా మారిన పరశురాంకి కూడా వర్తిస్తుంది. ఈయన తన కెరీర్ నిఖిల్ హీరోగా వచ్చిన ‘యువత’తో ప్రారంభం అయింది. చిన్న చిత్రంగా వచ్చిన ఈ చిత్రం నిఖిల్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘హ్యాపీడేస్’ తర్వాత నిఖిల్‌కి దక్కిన హిట్ ఇదే. ఆ తర్వాత ఆయన బండ్లగణేష్-రవితేజ కాంబినేషన్‌లో ‘ఆంజనేయులు’ చిత్రం తీశాడు. ఈ చిత్రం మంచి హిట్టయింది.
ఆతర్వాత నారా రోహిత్ హీరోగా ‘సోలో’ చిత్రం చేశాడు. ఇది కూడా వర్కౌట్ అయింది. కానీ ఆ తర్వాత ఈయన అశ్వనీదత్ కుమార్తెలతో రవితేజ హీరోగా ‘సారొచ్చారు’ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో దర్శకునిగా ఈయనకు నాలుగేళ్ల గ్యాప్ వచ్చింది. అదే సమయంలో ఆయనకు గీతాఆర్ట్స్ నుంచి పిలుపు వచ్చింది. అల్లు శిరీష్‌కి లభించిన ఏకైక హిట్‌ని ‘శ్రీరస్తు..శుభమస్తు’తో పరశురాం అందించాడు. ఇక తాజాగా విడుదలైన ‘గీతాగోవిందం’ చిత్రం డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని చెప్పాలి. దీని తర్వాత ఆయనతోనే మరో చిత్రం చేస్తామని ‘గీతాగోవిందం’ నిర్మాత, గీతాఆర్ట్స్2 వ్యవహారాలు చూసే బన్నీవాసు ప్రకటించాడు. ఇక ఈయన సునీల్‌తో ‘నాకేంటి’ అనే చిత్రం చేయాలని కూడా భావిస్తున్నాడు. మరోవైపు ఈయనతో చిత్రం చేయడానికి అల్లుఅర్జున్ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని, ఆ కథను పరశురాం తయారు చేస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా గీతాఆర్ట్స్‌లో వరుసగా రెండు హిట్స్ ఇచ్చిన దర్శకునిగా పరశురాం పేరు తెచ్చుకున్నాడు.
ఇక ఈయన తాజాగా మాట్లాడుతూ.. ‘ఆంజనేయులు’ చిత్రం చేశాను. నాకున్న స్పీడ్‌కి సరిగ్గా ప్లాన్ చేయలేకపోయాను. నేను కాస్త దృష్టి పెడితే సినిమాలోని కొన్ని అంశాలను ఇంకా బాగా హ్యాండిల్ చేయగలిగేవాడిననే విషయం కూడా నాకు ఆరోజు తెలియదు. ‘సోలో’ సినిమా చేసే సమయానికి కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఆ తర్వాత నా డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘సారొచ్చారు’ తీశాను. కొంతమంది కథలో మార్పులు చేయించడం వల్ల నేను అనుకున్న విధంగా తీయలేకపోయాను. దానికి కారణం నా మొహమాటమే. ఆ మొహమాటమే నా కొంప ముంచింది. అప్పటివరకు నాకు సన్నిహితంగా ఉంటూ నువ్వు సూపర్‌రా.. అని పొగిడిన వారంతా తర్వాత నా మనసును గాయపరిచి దూరమయ్యారు. ఆ సమయంలో నాకు అండగా నిలబడింది నా భార్య మాత్రమే అని చెప్పుకొచ్చాడు పరశురాం.