సెప్టెంబర్ మొదటి వారంలో జనసేన పార్టీ హైదరాబాద్‌లో బహిరంగ సభ ద్వారా తెలంగాణలో కూడా తన సత్తా చాటడానికి సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ సభలోనే తెలంగాణలో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోనుంది? అనే విషయంపై పవన్ క్లారిటీ ఇవ్వనున్నాడని సమాచారం. ఇంతకాలం జనసేనను ఆంధ్రా పార్టీగా అభివర్ణిస్తున్న వారికి సమాధానం చెప్పేందుకు జనసేనాధినేత సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే తెలంగాణలో తమతో పలు పార్టీలు పొత్తు పెట్టుకోవడానికి సిద్దంగా ఉన్నాయని పవన్ ఆల్‌రెడీ చెప్పి ఉన్నాడు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉండాలని ఆయన ఆదేశించారు.
తెలంగాణలో పార్టీ విస్తరణకు, కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి వెంటనే దాని బాధ్యులు, జిల్లా కమిటీల నియామకాన్ని వెంటనే ప్రారంభించి, మొత్తం ప్రక్రియను రెండు మూడు వారాలలో పూర్తి చేయాలని జనసేనాధినేత భావిస్తున్నారు. అయితే జనసేన తెలంగాణలోని అధికార పక్షమైన టిఆర్‌ఎస్‌కి అనుకూలంగా వ్యవహరిస్తోందని, తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్రుల ఓట్లు అధికంగా ఉన్న చోట పోటీ చేసి వాటిని చీల్చాలని భావిస్తోందని పలు ప్రతిపక్షాలు పవన్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో సభ పెట్టడం కూడా దీనినే సూచిస్తోందని, దానికి సంకేతంగా దీనిని భావించాలని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై పవన్ ఏం సమాధానం ఇస్తాడో కూడా వేచిచూడాల్సివుంది...!