ఎప్పుడెప్పుడు చిరంజీవి సై రా నరసింహారెడ్డి లుక్ ని చూస్తామా .. ఎప్పుడెప్పుడు చిరు సై రా టీజర్ ని చూస్తామా అని ఏడాది కాలంగా మెగా అభిమానుల ఎదురు చూపులు తాజాగా చిరంజీవి పుట్టినరోజు టైం కి ఫలించాయి. రామ్ చరణ్ నిర్మాతగా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి లుక్ ని గత ఏడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ రూపంలో చిరు సై రా లుక్ విడుదల చేశారు. అయితే ఆ మోషన్ పోస్టర్ లో చిరంజీవి వెనుకకు తిరిగి నుంచున్న పోస్టర్ కావడంతో.. చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లుక్ లో ఎవరికీ స్పష్టత లేకపోయింది. ఇక నాలుగైదు రోజులుగా... కత్తిని చూపిస్తూ కౌంట్ డౌన్ పోస్టర్స్ ని వదులుతూ సై రా నరసింహారెడ్డి టీజర్ పై మెగా ఫాన్స్ లోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని క్రియేట్ చేసింది సై రా బృందం.
ఇక చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకుని చిరు తల్లి అంజనా దేవి, చిరు భార్య సురేఖ చేతుల మీదుగా సై రా దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత రామ్ చరణ్ సమక్షంలో సై రా నరసింహారెడ్డి టీజర్‌ని ఈరోజు మంగళవారం ఉదయం అనుకున్న టైంకి విడుదల చేశారు. మరి సై రా నరసింహారెడ్డిని దేశంలోని పలు భాషల్లో విడుదల చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్న సై రా బృందం ఇప్పుడు సై రా టీజర్ తోనే సినిమాపై అమాంతం అంచనాలు పెంచేశారు. సై రా నరసింహారెడ్డి టీజర్‌లో బ్రిటిష్ సైన్యంపై నరసింహారెడ్డి దండెత్తే సన్నివేశాలతో పాటుగా సై రా నరసింహారెడ్డి లో చిరంజీవి లుక్ ని చూపించారు. సై రా నరసింహారెడ్డి గెటప్‌లో చిరంజీవిని చూస్తుంటే నిజంగానే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. సై రా లుక్ లో చిరంజీవి ఉగ్రరూపం మాత్రం అదరగొడుతుంది. గుర్రం మీద సై రా నరసింహారెడ్డిగా చిరంజీవి విశ్వరూపం చూపిస్తున్నాడు. ఇంకా ఈ టీజర్లో బ్రిటిష్ వారికి ఎదురు నిలబడి పోరాడుతూ వారికి చమట్లు పట్టించే పోరాట యోధుడిగా చిరంజీవి నిజంగా అంటే నిజంగా అదరగొడుతున్నాడు.
కోట మీద నుంచుని బ్రిటిష్ సైనికులకు చుక్కలు చూపించడానికి రెడీగా ఉన్న సై రా నరసింహారెడ్డి ని చూస్తుంటే.. మొహంలో ఆ తేజస్సు... అబ్బా నిజంగా చిరు సూపర్ గా ఉన్నాడనిపిస్తుంది. ఇక ఆంగ్లేయుల మీద దండెత్తే క్రమంలో నరసింహారెడ్డిగా చిరు ప్రజలను ఉద్దేశించి.. ‘ఈయుద్ధం ఎవరిదీ..’ అంటే ప్రజలు మనది అని చెప్పడం.. ఇంకా కోటలోని భారీ తనం.. బ్రిటిష్ సైనికులు, అలనాటి పద్ధతులు, బ్రిటిష్ వారు ఎలా ఉండేవారో.. ఇంకా బ్రిటీష్ నాయకుడు నరసింహారెడ్డి అని అరవగానే... సై రా నరసింహారెడ్డి గుర్రం మీద చెట్ల పొదల్లో నుండి బయటికి వస్తూనే ఆంగ్లేయ సైనికులను కస కస కత్తితో నరకడం.. వెరసి సైరా ఉగ్రరూపం కనబడుతుంది. ఇంకా సై రా సెట్ లోని భారీ తనం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫీ.. నిర్మాణ విలువలు అన్ని అంటే అన్ని సై రా నరసింహారెడ్డి సినిమా మీద అంచనాలు పెంచేలా కనబడుతున్నాయి. ఇక సై రా 1.17 మినిట్స్ టీజర్ తోనే ఉర్రుతలూగించడం.. మెగా ఫాన్స్ కి పండగనే చెప్పాలి. సై రా లుక్ లో చిరుని చూస్తుంటే.. ఈ సినిమా కోసం చిరంజీవి ఎంతగా కష్టపడుతున్నాడో అనేది తెలుస్తుంది. సినిమాలో ఇంత భారీ తనం... ఇంత కష్టం ఉండబట్టే సై రా నరసింహారెడ్డి షూటింగ్ లెట్ అవుతూ వస్తుంది. ఇక ఈ సినిమాని ఎలా హ్యాండిల్ చేస్తాడో అనుకున్న సురేందర్ రెడ్డి.. ఈ టీజర్‌తో అతనిపై ఉన్న అనుమానాలన్నీ తుడిచేశాడు.
ఇక భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, తమన్నా వంటి నటులు నటిస్తున్నారు. ఇక చిరంజీవి పుట్టిన రోజు కానుకగా విడుదలైన సై రా నరసింహారెడ్డి యూట్యూబ్ రికార్డులను కొల్లగొట్టడం ఖాయంగానే కనబడుతుంది.